భలే... డిపాజిట్ దక్కింది

భలే... డిపాజిట్ దక్కింది - Sakshi


రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా కోపం చల్లారలేదు. ఆ విషయం నందిగామ ఉప ఎన్నిక ద్వారా మరోసారి రుజువైంది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావు... టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చేతిలో ఓడిపోయారు. కాకుంటే చావు తప్పి కన్నులోట్ట బోయినట్లు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ మాత్రం దక్కిందని ఆ పార్టీ నేతలు మురిసిపోతున్నారు ... రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలలో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకూడదంటూ తమ తీర్పు ద్వారా వెల్లడించారు.



అయితే నందిగామ శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు ఆకస్మికంగా మరణించారు. దాంతో టీడీపీ ప్రభుత్వం ఉప ఎన్నికను నివారించేందుకు... తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాల మద్దతును కూడా కూడగట్టింది. అందుకు ఆ పార్టీలు కూడా సానుకూలంగా స్పందించాయి. సౌమ్య ఎన్నిక ఏకగీవ్రం అవుతుందని అనుకున్నరంతా. ఆ దశలో గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ ఆ ఉప ఎన్నిక ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నట్లుంది.



అంతే తమ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వెల్లడించింది. అనుకున్నదే తడువుగా బోడపాటి బాబురావు తమ అభ్యర్థి అని ప్రకటించింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పార్లమెంట్, వివిధ రాష్ట్రాల శాసనసభకు నిర్వహించిన ఉప ఎన్నికలతోపాటు నందిగామ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలంతా ప్రచారం కూడా చేశారు.



కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  బోడపాటి బాబురావుపై టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని బాధ నుంచి డిపాజిట్ దక్కించుకున్నామని కొద్దిలో కొద్దిగా ఆత్మసంతృప్తి దక్కింది... సదరు నాయకులకు. దీంతో 100 రోజుల కిత్రం జరిగిన ఎన్నికల నాటికంటే కొద్దిగా పురోగతి సాధించామని కాంగ్రెస్ నాయకులు తెగ సంతోషంతో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top