రాములమ్మ ఏమైంది

రాములమ్మ ఏమైంది - Sakshi


ఇంకేముంది తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆ ప్రాంత ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని భావించింది. ఆ క్రమంలో 'కారు'ను కాదని హస్తం పట్టుకుంది. కానీ ఆ హస్తమే తనకు భస్మాసుర హస్తం అవుతుందని ఆమె ఊహించలేదు. ఇంతకీ ఆమె ఎవరిని అనుకుంటున్నారా  అదేనండీ రాములమ్మ. లేడీ అమితాబ్ విజయశాంతి. వెండి తెరపై ఒకానొక కాలంలో తెరవేల్పుగా ఓ వెలుగు వెలిగింది. తన తుది శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడుతానని రాములమ్మ ప్రకటించింది. తెలంగాణ అయితే వచ్చింది కానీ రాములమ్మ మాత్రం ప్రస్తుతం సోదిలో లేకుండా పోయింది.



ఇంతకీ ఏం జరిగింది : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ఆమె తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది. అనంతరం ఆ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. దాంతో టీఆర్ఎస్కు మరింత బలం వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షడు కేసీఆర్ పొంగిపాయాడు. విజయశాంతి తనకు దేవుడిచ్చిన చెల్లి అని ప్రకటించి... లోక్సభ అభ్యర్థిగా మెదక్ స్థానం నుంచి బరిలో నిలిపాడు. దాంతో మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ మెట్లు చకచక ఎక్కేసింది. అయితే ఆ పార్టీలో ఆమెకు ప్రాధాన్యం రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. ఆ క్రమంలో పార్టీ మారాలని ప్రయత్నించింది. ఆ విషయం తెలిసి తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీతో మంచి సంబంధం ఉన్నా, మోడీ సారథ్యంలో బీజేపీలో చేరాలా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది.



అంతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని... ఆ పార్టీలో చేరితే మంత్రి పదవి కూడ దక్కవచ్చు ... కారు పార్టీకి సింగిల్ డిజిట్ తప్పదని అనుకుంది.అంతే ఓ ఫైన్ డే మార్నింగ్ 'కారు ఎక్కించుకున్న అన్నయ్య'కు ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుంది. ఎన్నికలు వచ్చాయి. ఆ వెంటనే ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన రాములమ్మ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడామె బీజేపీలో చేరినా పోయేదని తెగ బాధపడి పోతుంది రాములమ్మ.


'రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయల్లే కూర్చోంటే ఏమీ కాదమ్మా' అంటూ ఆమె అభిమానులు బీజేపీలో చేరాలంటూ తెగ పోరు పెడుతున్నారు. దాంతో రాములమ్మ కమల తీర్థం తీసుకునేందుకు ఆ పార్టీ వైపు వడివడిగా అడుగులు వేస్తుందని సమాచారం. అదికాక కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగాలని కూడా రాములమ్మ వ్యూహా రచన చేస్తుందని తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top