తమ్ముళ్లకు 'మైండ్ మసాజ్'

తమ్ముళ్లకు 'మైండ్ మసాజ్' - Sakshi


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో 'ఆ ఆనందం' మూడు నాళ్ల ముచ్చటగా మారింది. ఓ వైపు రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు, మరోవైపు జారుకుంటున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహారంతో బాబుగారికి కునుకు కరువైంది. టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రంలో పడి తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు ఒక్కొరుగా కారు ఎక్కేస్తున్నారు. దీంతో ఆ రెండు కళ్ల సిద్దాంతకర్తకు ఏటు వైపు చూడాలో అర్థం కాక తెగ సతమతమైపోతున్నాడు. రాజధాని ఏర్పాటుపై ఓ కమిటీ వేసి ఆ సంగతి మంత్రి వర్గానికి అప్ప చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ తెలంగాణలో తెలుగు తమ్ముళ్ల గోడ దూకూళ్లను అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పటికే 30 ఏళ్లుగా తనతో పార్టీతో అనుబంధం ఉన్న తుమ్మల చటుక్కున కారు ఎక్కెశారు.  



దీంతో సదరు జిల్లాలో సైకిల్ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదంలో పడింది. వరంగల్ జిల్లాకు చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి కూడా రేపోమాపో కారు ఎక్కేస్తారంటూ ప్రచారం జరిగింది. తాను అసలు తెలంగాణ సీఎం కేసీఆర్నే కలవలేదని సదరు తమ్ముడు చెప్పాడు. దీంతో అర్థరాత్రి కేసీఆర్ను కలసిన ఎర్రబెల్లి అంటూ మీడియా రచ్చరచ్చ చేయడంతో సదరు తమ్ముడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ను కలిసిన మాట వాస్తవమే కానీ అర్థరాత్రి కాదు సాయంత్రం అంటూ చెప్పిన తప్పును మీడియా సాక్షిగా కరెక్ట్ చేసుకున్నారు.



అలాగే సనత్నగర్ ఎమ్మెల్యే, పొలిట్బ్యూరో సభ్యుడు టి.శ్రీనివాసయాదవ్ పార్టీ సమావేశాలకే హాజరుకావడం లేదు. దీంతో ఆయన మానసికంగా ఎప్పుడో కారు ఎక్కేశారని ఇప్పటికే తమ్ముళ్లు చెవ్వుల్లో చెప్పుకుంటున్నారు.  అదికాక గ్రేటర్ ఎన్నికలు ఆగమేఘాలపై దూసుకు వస్తున్నాయి. దీంతో ఇక ఉపేక్షిస్తే తెలంగాణలో కారు దెబ్బకు సైకిల్ నుజ్జునుజ్జుకాక తప్పదని భావించిన చంద్రబాబు రంగంలోకి దిగి తమ్ముళ్లను బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు.



అందులోభాగంగా గులాబీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో బాబు మంగళవారం భేటీ అయ్యారు. పార్టీలో మాంచీ ప్రాధాన్యమున్న పోస్ట్ అప్పగిస్తామంటూ బాబు తీగలకు భరోసా కూడా ఇచ్చారు.  కానీ కారు ఎక్కెందుకు తీగల ఉన్నట్లు సమాచారం. కార్యకర్తులు, అభిమానులతో మాట్లాడి చెబుతానని అన్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లకు ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇస్తూ... మీకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికలే కాదు... 2019 నాటికి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి తీసుకురావాలి... తీసుకువద్దాం అంటూ తమ్ముళ్ల మైండ్ మసాజ్ చేస్తున్నారు. కానీ బాబుగారి కలలను తమ్ముళ్లు నిజం చేస్తారో లేదో కాలమే చెప్పాలి. కాదు కాదు పచ్చ తమ్ముళ్లే చెప్పాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top