ఇదేం ఖర్మరా 'బాబూ'

ఇదేం ఖర్మరా 'బాబూ' - Sakshi


10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... ఎప్పుడు అధికారంలోకి వస్తామా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. తీరా అధికారంలోకి వచ్చాకా ఎందుకు వచ్చామురా 'బాబు' అంటూ తలలు పట్టుకుంటున్నారు పచ్చ తమ్ముళ్లు. పాపం ఎందుకు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు అంటే.... ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన తమ్ముళ్లకు ... ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అని లేదా నామినేటేడ్ పదవులు ఉన్నాయిగా అంత కంగారు పనికిరాదని అని తమ్ముళ్లను అధినేత ఎన్నికల మందు లాలించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాబు పాలించడం మొదలు పెట్టిన తర్వాత 'తమ్ముళ్ల లాలింపు' సంగతి మరచిపోయాడు.



టీటీడీ పాలక మండలి ఛైర్మన్గానో లేదా సభ్యునిగానే నామినేటెడ్ పోస్ట్ కొట్టేసి ... తిరుమల శ్రీవారి ఆలయంలో తిష్ఠ వేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్ల ఆశల ఇప్పుడిప్పుడే ఫలించేలా లేవు. టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తారని అందరు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారటీని ఏర్పాటు చేయడంతో తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చిలకరించినట్లు అయింది.ఆ ఆథారటీ తాత్కాలికంగానే అని చెప్పినా దాదాపు రెండు నెలలు మించి ఉంటుందని తమ్ముళ్లలో తెగ దిగులుపట్టుకుంది.



టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీ మోహన్లతోపాటు ఆ పార్టీ నేతలు గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే తమ ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని  ఆ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం హైదరాబాద్లో మీడియా ఎదుట వాపోయాడు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత మంత్రికి చెప్పకుండానే టీటీడీ స్పెసిఫైడ్ అథారటీని సీఎం గారు ప్రకటించారని తన ఆగ్రహాన్ని ఇక మింగలేనంటూ కక్కి మరి చెప్పాడు. అంతేనా టీటీడీ ఛైర్మన్గా ఏకపత్నీవ్రతుడ్ని నియమించాలని అధినేతకు హితవు పలికాడు. ఛైర్మన్ గిరి పీఠం అధిష్టించేవారికి వాక్శుద్ధి కూడా ఉండాలని అసలు నిబంధనకు మరో కొసరు నిబంధన తగిలించాడు. అయితే టీటీడీ ఛైర్మన్ కోసం బాబుగారు వెతుకులాట ఇంకా కొనసాగుతునే ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top