అక్కడ ఆయన... ఇక్కడ ఈయన

అక్కడ ఆయన... ఇక్కడ ఈయన - Sakshi


ఒకనాటి చాయ్వాలా దేశానికి ప్రధాని అయి 100 రోజులు పూర్తి అయిందో లేదో మరో చాయ్వాలా ఓ రాష్ట్రానికి సీఎం అయిపోయారు.  ఒకరు తన ప్రసంగాలతో దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టి... పీఎం పీఠం అధిష్టిస్తే...  మరోకరు 'అమ్మ' యందు భక్తి ప్రపత్తులతో మెలిగి ఆమె అచంచల విశ్వాసాన్ని పొందారు. అందుకు ప్రతిగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేశారు. ఆయన ఎవరో ఈ పాటికి అర్థమైయే ఉంటుంది. ఆయనే తమిళనాడు సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఓ. పన్నీరు సెల్వం. ఈ కొత్త ముఖ్యమంత్రిగారి స్వస్థలం పెరియకుళం. ఆయన స్థానికంగా హోటల్లో టీ విక్రయించే వారు. అంతేకాదు ఆయనే టీ కప్పులు కూడా కడుక్కునే వారు. అనుకోకుండా ఆయన ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1996లో పెరియకుళం మున్సిపాలిటి ఛైర్మన్గా అయ్యారు. ఆ తర్వాత అంటే 2001లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో... పెరియకుళం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు.



అప్పుటికే అమ్మ జయలలిత మనస్సు గెలుచుకున్నారు. దీంతో ఆమె కేబినెట్లో పీడబ్ల్యూడీ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అమ్మ రాజీనామా చేయక తప్పలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎంతమంది సీనియర్లు ఉన్నా అమ్మ మాత్రం పన్నీరుకే సీఎం పీఠం అప్పగించింది.  దీంతో 2001 నుంచి 2002 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన అమ్మకు తనకు అప్పగించిన కుర్చిని గుడ్బాయిలా మళ్లీ అలాగే అప్పగించేశారు. ఆ వినయం, ఆ విధేయత అమ్మ మనస్సును కట్టిపడేశాయి. అంతే సెప్టెంబర్ 28న జయలలితకు అక్రమ ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడగానే... ఈసారి అయిన తమకు సీఎం పదవి వస్తుందని ఆ పార్టీలోని సీనియర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ సృష్టిలో విశ్వాసానికే మించినది లేదంటూ మళ్లీ పన్నీరుకే సీఎం పీఠాన్ని అమ్మ అప్పగించి....నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పకనే చెప్పింది.



1991 -1996 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత అక్రమంగా ఆస్తులు సంపాదించారని అప్పటి జనతాదళ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ కేసు 18 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఆ క్రమంలో బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. ఆ కేసులో జయలలిత ఆస్తులు కూడబెట్టినట్లు నేరం రుజువైంది. దీంతో సెప్టెంబర్ 28న అమ్మకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో సీఎంగా ఉన్న జయలలిత పదవిని కోల్పోయింది. ఆమె కేబినెట్లో ఉన్న పన్నీరు సెల్వం రెవెన్యూ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.  ఒకప్పటి చాయ్వాలా అయిన మోడీ కేంద్రంలో పాగా వేస్తే, పన్నీరు సెల్వం తమిళనాడులో గద్దె నెక్కారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top