ఏం బ్రదర్ అప్పుడే అసంతృప్తా?

ఏం బ్రదర్ అప్పుడే అసంతృప్తా? - Sakshi


రాష్ట్ర విభజన అనివార్యం అని తెలిసింది. అంతే రాయల్ తెలంగాణ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. ఆ నినాదాన్నే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ముందు నిత్యం 'అనుష్టానం' చేశాడు. కానీ ఆ పార్టీ 'పెద్దలు' మాత్రం ఆయన నినాదాన్ని పక్కన పెట్టారు. రాష్ట్ర విభజనపై తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా సదరు పెద్దలు వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకున్న ఆ చలాకీ నేత రాష్ట్రంలో 'హస్తం పార్టీ'కి నూకలు చెల్లి పోయే కాలం ఆసన్నమైందని అర్థమైంది. అంతే తనతోపాటు తన బ్రదర్నీ తీసుకుని ... ఎన్నో కీలక పదవులు అందించిన పార్టీకే 'చెయ్యి' ఇచ్చి అమాంతంగా సైకిల్ ఎక్కేశాడు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎంపీగా ఎన్నికైయ్యారు. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయనే జేసీ బ్రదర్స్లో ఒకరైన జేసీ దివాకర్ రెడ్డి.



అయితే  పచ్చ పార్టీలో చేరిన కేవలం అయిదు నెలల్లోనే దివాకరుడిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అందుకు ఇటీవల ఆయన తెలంగాణ అసెంబ్లీలో తన పాతమిత్రుల వద్ద చేసిన వ్యాఖ్యాలే ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ... ప్రాంతీయ పార్టీల్లో స్వేచ్ఛ తక్కువ అని వ్యాఖ్యానించారు. అదికాక తనకు ఎంపీ పదవి సరిపోదని ఆయన సదరు మిత్రుల వద్ద మనసులో మాటను చెప్పుకున్నారు.  మరోవైపు రాష్ట్రంలోని ఏదో ఒక నామినేటడ్ పోస్ట్ తనను తప్పక వరించ వచ్చని బ్రదర్ జేసీ చాలా ఆశలు పెట్టుకున్నారని సమాచారం. ఒకానొక దశలో టీటీడీ ఛైర్మన్ గిరి ఆయనకే దక్కుతుందన్న వార్త మీడియాలో షికారు చేసింది. అయితే ఆ పదవే కాదు ఏ నామినేటడ్ పోస్ట్లను భర్తీ చేయనంటూ బాబు వాటిని అటకెక్కించేశారు. దాంతో బ్రదర్ దివాకర్ ఆశలు అడియాసలు అయ్యాయి. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top