బాధలు చెప్పకుండా.. భజనతో సరి

బాధలు చెప్పకుండా.. భజనతో సరి - Sakshi


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, రణస్థలం: తుపాను ప్రాంతాల ప్రజలతో సీఎం ముఖాముఖీ కార్యక్రమం ఫక్తు ముఖస్తుతిగా మారింది. రణస్థలం మండలం కోష్ట జంక్షన్‌లో  జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ జనం విస్తుపోయేలా చేసింది. తుపాను ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులెదురవుతున్నా,  నష్టం అందకపోయినా, బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా నేరుగా సీఎంతోనే చెప్పుకోవచ్చని జిల్లా టీడీపీ నేతలు హడావుడి చేశారు. తీరా కార్యక్రమంలో మాట్లాడిన వారు మాత్రం.. తెలుగుదేశం సర్పంచ్, వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీ, జిల్లా ఐకేపీ సభ్యులు, మహిళా కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు.. వీరైన తాము, తమ తోటి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను సీఎంకు వివరించాల్సింది పోయి.. వచ్చిన అవకాశాన్ని సీఎంను పొగడటానికే సరిపెట్టారు. సీఎం మా గొప్పగా చేసేశారని, తమ ఎమ్మెల్యే సహా అధికారులు ముందుగానే తుపాను హెచ్చరికలు జారీ చేయడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందని, బాధిత ప్రాంతాలకు నాలుగు రోజుల్లోనే కరెంటు వచ్చేసిందని చెప్పడం విస్మయం కలిగించింది. జిల్లాలోని ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ రాకపోవడం గమనార్హం.  

 

 అసలు బాధితులకు అవకాశం లేదు

 అసలు రైతులు, బాధితులు, తీర ప్రాంత వాసులకు సీఎంతో మాట్లాడే అవకాశమే లేకపోయింది. ఇదంతా గమనిస్తున్న అధికారులూ మిన్నకుండిపోయారు. ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించిన వెంటనే తొలుత విశాఖ వాసులు మాట్లాడారు. తరువాత విజయనగరం వాసులు మాట్లాడాల్సి ఉన్నప్పటికీ లింక్ ఫెయిల్ కావడంతో వెంటనే శ్రీకాకుళం జిల్లా వాసులతో సీఎం మాట్లాడారు. వాస్తవానికి జిల్లా నలుమూలల నుంచి జనం వస్తారనుకుంటే అధిక శాతం ఎచ్చెర్ల నియోజకవర్గం వారినే రప్పించడంతో మిగతా ప్రాంతాలవారు ఉసూరుమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు కార్యక్రమానికి హాజరుకాకపోయినా ఆయన్ని పదేపదే పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ముందస్తు ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరైనట్టుగా ఏర్పాట్లు చేయడం, బందోబస్తు భారీగా ఉండటం విశేషం. అయితే ఆ స్థాయిలో జిల్లా నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి, విప్ హాజరైతే బావుండేదని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారు.

 

 ఒకరో..ఇద్దరో..

 వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను కష్టాలు చెప్పుకున్నది ఒకరో ఇద్దరో..మిగతా వారంతా టీడీపీ ముందుగా ఏర్పాటు చేసిన భజన బృందమే. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, పంట నష్టం తొందరగా అందించాలని, నష్టాల సర్వే పారదర్శకంగా ఉండాలనే చెప్పారు తప్ప లోటుపాట్లు, పునరుద్ధరణ చర్యల్లో జాప్యంపై ఎవరూ నోరు విప్పలేదు. హాజరైన వారిలో డి. మహాలక్ష్మి టీడీపీ సర్పంచ్, పి. జగన్నాధం టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, పైడి అప్పడు దొర టీడీపీ నేత. డి.అశోక్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు. లంక శ్యామలరావు టీడీపీకే చెందిన రావడ గ్రామ సర్పంచ్. పిసిని అసిరి నాయుడు కోష్ట ఎంపీపీ. పల్లి చింతమ్మ మహిళా సంఘం అధ్యక్షురాలు. పిన్నింటి భాను రణస్థలం టీడీపీ నాయకుడు. వీరితోపాటు పైడిరాజు, రాంబాబు, లక్ష్మీ, కరిమజ్జి రమణ,సుధీర్, కెళ్ల గోవింద తదితరులు  కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top