ఇంకా ఎన్నాళ్లు?


సాక్షి, కడప :  గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టు పరిధిలోని రైతులు పరిహారం అందక ఇక్కట్లు పడుతున్నారు. ప్రతి ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అని ప్రభుత్వం అట్టహాసంగా చెబుతున్నా, భూమి కోల్పోయిన రైతులకు మాత్రం అగచాట్లు తప్పడం లేదు. 2007-08 ప్రాంతంలో తవ్విన సంపులు, కాల్వలకు సంబంధించి రైతులు భూములు కోల్పోయినా నేటికీ పరిహారం అందలేదు. కొందరు 50 సెంట్లు కోల్పోతే, మరికొందరు ఎకరా కోల్పోయారు. గాలేరు-నగరి కాలువ కింద పిల్ల కాలువలు, సంపులు నిర్మించి మైక్రో ఇరిగేషన్ ద్వారా పైపులను అమర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా రైతుల విషయంలో మాత్రం ఎందుకు పరిహారం అందించకుండా ఆలస్యం చేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం కరువవుతోంది.

 

 కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

  గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం కింద చేపడుతున్న మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన రైతుల పొలాల్లో సంపులు, కాలువలు నిర్మించారు. పైడిపాలెం నుంచి వచ్చే కాలువకు అనుసంధానంగా సంపుల ఏర్పాటు జరిగింది. అయితే తొండూరు మండలంలో పదుల సంఖ్యలో రైతులు భూములను సంపులకు ఇచ్చారు. సంపుల కింద భూమి కోల్పొయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పరిహారం అందక బాధిత రైతులు ముద్దనూరులోని గాలేరు-నగరి భూ సేకరణ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

 

 జేసీ-2, స్పెషల్ కలెక్టర్‌ను కలిసిన రైతులు

 తొండూరుకు చెందిన రైతులు వెంకట్రామిరెడ్డి, రామాంజనేయరెడ్డి, నడిపి రాజా, నాగిరెడ్డి తదితరులు వెళ్లి కడప కలెక్టరేట్‌లోని జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. ఏళ్ల తరబడి ఉన్నా పరిహారం అందలేదని, భూమిని సంపునకు ఇవ్వడంతో ఏడెనిమిదేళ్లుగా పంటలు వేసుకోలేదని వివరించారు. పంట పండక, పరిహారం అందక రెండు విధాల నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేయగా, ఆయన గాలేరు-నగరి ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావును కలవాలని సూచించారు. అనంతరం రైతులు ఆయన్నూ కలిశారు. ముద్దనూరు స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్‌ను కలిసి సమస్య తెలియజేయాలని, వెంటనే నివేదికలు తెప్పించుకుని పరిహారం మంజూరు చేస్తామని ఆయన హామి ఇచ్చారు.

 

 పరిహారం వెంటనే అందించాలి

 నా పేరు అట్ల రామాంజనేయరెడ్డి. మాది తొండూరు. 217/1ఏ సర్వే నెంబరులో 89 సెంట్ల భూమి సంపునకు పోయింది. 2013లో నా భూమిలో సంపు, కాలువ నిర్మించారు. 2013 జులై 6వ తేదిన పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ పరిహారం మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నిమార్లు తిరిగినా న్యాయం జరగలేదు. ఎవరిని కలవాలో తెలియక అవస్థలు పడుతున్నా.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top