అందని ద్రాక్షగా అందరికీ విద్య


సంక్షోభం తప్ప సంక్షేమం కానరాని విద్యావ్యవస్థ

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి


 

 పట్నంబజారు(గుంటూరు) : తెలుగుదేశం పాలనలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ విద్య అందని ద్రాక్షగా మిగిలిందన్నారు. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఆదివారం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పానుగంటి చైతన్య ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సభకు పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షత వహించారు.



ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి టీడీపీ బూజు పట్టించిందని మండిపడ్డారు. విద్యారంగాన్ని కాపాడుకునే దిశగా పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం, విద్యారంగ ప్రక్షాళనను వైఎస్ జగన్ నేతృత్వంలో విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తే టీడీపీకి పుట్టగతులుండవని స్పష్టం చేశారు.



పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ సమర్ధుడైన పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థులు పాలకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే రీతిలో చైతన్య నేతృత్వంలోని విద్యార్థులు కదలాలని సూచించారు. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ విద్యార్థి విభాగం పటిష్టంగా ఉంటే ఆ పార్టీ నిర్మాణం బలంగా ఉంటుందన్నారు. లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విద్యార్థి దశ చాలా కీలకమైందన్నారు.



పానుగంటి చైతన్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి, తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన విజయసాయిరెడ్డి, అప్పిరెడ్డి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పానుగంటి చైతన్యతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావును విజయసాయిరెడ్డి ఇతర పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.



కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా, సురేష్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నశీర్ అహ్మద్, గుంటూరు రూరల్ మండల మాజీ అధ్యక్షుడు లాలుపురం రాము, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి రాము, చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, డైమండ్‌బాబు, కర్ణుమా, హుస్సేన్, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, పడాల సుబ్బారెడ్డి, మేరువ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top