‘అనంత’ వేదన పై.. గళం విప్పాలి


అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ అధికారం చేపట్టి తొమ్మిది నెలలైంది. ఆ పార్టీ తరఫున జిల్లా నుంచి 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి కోసం 19 హామీలను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి దాకా వాటి అమలు దిశగా అడుగైనా వేయలేదు. హంద్రీ-నీవాను ఏడాదిలో పూర్తి చేస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయి. కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలోనూ అదే తంతు. మొత్తం మీద కొత్త ప్రభుత్వంపై ‘అనంత’ వాసులు పెట్టుకున్న కోటి ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో 9నెలల ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గళం విప్పేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీలకతీతంగా సమష్టిగా గళం వినిపించకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ ‘అనంత’కు తీవ్ర అన్యాయం తప్పదు.

 

 సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారంటే కరువు తీవ్రత ఇట్టే తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం కరువు నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైంది. కరువు పరిస్థితిపై ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపలేదు. కేంద్రబృందం పర్యటించే పరిస్థితులు కూడా కన్పించడం లేదు. కనీసం ఉపాధిహామీ పథకంపై ప్రత్యేక దృష్టి సారించి అందరికీ పనులు కల్పించడంలో కూడా విఫలమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.27లక్షల కుటుంబాలు కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వలసెళ్లాయి.  

 

 ఉపాధిహామీ అమలులో నిర్లిప్తత

 కరువు తీవ్రత ఉన్నా ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంతో డ్వామా అధికారులు పూర్తి నిర్లప్తత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో జాబ్‌కార్టుల లెక్కల ప్రకారం 18.11లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇప్పటి దాకా ఒక్కో కుటుంబానికి 49.07రోజులు పని కల్పించారు. వందరోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు కేవలం 25,337 మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే చాలు జిల్లాలో రైతులు, రైతు కూలీలు ఎందుకు వలసెళుతున్నారో? ప్రభుత్వం ఏ మేరకు ‘ఉపాధి’ కల్పిస్తోందో ఇట్టే తెలుస్తుంది.

 

 పంట నష్టపరిహారం ఏదీ ‘బాబు’

 ఈ ఏడాది 5.06 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటసాగు చేస్తే మొత్తం పంట తుడిచిపెట్టుకుపోయింది. దీనికి 573 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం ఊసెత్తలేదు. 2013-14కు సంబంధించి 643.37కోట్ల రూపాయల ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. దీని విడుదలకు చర్యలు తీసుకోలేదు.

 

 2011కు సంబంధించి 28.40కోట్లు, 2012కు సంబంధించి మరో రూ. 3కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటి విడుదలపై కూడా చిత్తశుద్ధి చూపలేదు. అలాగే గతేడాదికి వాతావరణ బీమా రూ.227కోట్ల బ్యాంకులకు చేరింది. రైతులు పాతబకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో బీమా సొమ్మును వారి ఖాతాల్లోకి జమ చేయలేదు. మూడేళ్లు వరుస కరువులు, ఈ ఏడాది రుణమాఫీ దెబ్బతో ‘అనంత’ రైతులు గుల్లయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లాలో 49మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది.  

 

 హంద్రీ-నీవాపై హామీలు.. నీటి మూటలు

 హంద్రీ-నీవాకు చంద్రబాబు తన 9ఏళ్ల గత హయాంలో 13కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే, వైఎస్ 5,600 కోట్ల రూపాయలను విడుదల చేసి 90శాతం పనులను పూర్తి చేశారు.  చంద్రబాబు సీఎంగా ఎన్నికైన తర్వాత ‘వ్యవసాయమిషన్’ను ప్రారంభించేందుకు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు ఏడాదిలో హంద్రీ-నీవాను పూర్తిచేస్తామని చెప్పారు.

 

  కానీ గత బడ్జెట్‌లో కేవలం వందకోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించారు. ఈక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హంద్రీ-నీవాను పూర్తి చేయాలని దీక్ష కూడా చేపట్టారు. ఏడాదిలో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తామని ఇటీవల జిల్లాకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు కూడా ప్రకటించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాలి.

 

 19హామీలలో ఏ ఒక్కటీ  నిర్మాణ దశకు చేరలేదు:

 ‘అనంత’ నుంచి కరువును తరిమికొడతానని, కరువు భయపడేలా అభివృద్ధి చేస్తానని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు బీరాలు పలికారు. జిల్లా అభివృద్ధి కోసం 19 వరాలు ప్రకటించారు. 9నెలల కాలంలో వాటిల్లో ఒక్కటి కూడా నిర్మాణదశకు చేరలేదు. ఇందులో సెంట్రల్ యూనివర్శిటీ, ఏయిమ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కేంద్రప్రభుత్వ సహకారంతో నిర్మించేవి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వీటి ప్రస్తావన లేదు.

 

 ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎన్ని హామీలకు చంద్రబాబు తొలవిడత నిధులు విడుదల చేస్తారో చూడాలి. వీటన్నిటిపై ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషాతో పాటు మంత్రులు పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత మిగిలిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పి ప్రాజెక్టులు, నిధులు సాధించుకోవాలి. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం ఏమరపాటు వహించినా జిల్లాకు అన్యాయం చేసిన వారవుతారు.

 

 కరువు నివారణ చర్యలు తీసుకోవాలి

 కరువుతో జిల్లా రైతులు, కూలీలు తీవ్ర వేదన పడుతున్నారు. అయినా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదు. హంద్రీ-నీవాకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి ఏడాదిలో పూర్తి చేయాలి. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే విడుదల చేయాలి. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. 9నెలల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టడం, ప్రత్యేక హోదా రప్పించడంలో విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాన్ని మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. వీటన్నిటిపై అసెంబ్లీలో గళం విప్పుతా.

 - విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ

 

 తాగునీటి సమస్య పరిష్కరించాలి

 కదిరి నియోజకవర్గంతో పాటు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎన్‌పీకుంట మండలంలో సోలార్‌పవర్ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న వారిలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారికి మాత్రమే పరిహారం ఇస్తామంటున్నారు. పాసుపుస్తకాలు లేకుండా సాగులో ఉన్న భూములనూ గుర్తించాలి. గతేడాదికి సంబంధించి రూ.643కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ, రూ.227 కోట్లు ఇన్సూరెన్స్ రావాలి. వీటిపై అసెంబ్లీలో మాట్లాడుతా.

 -అత్తార్‌చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి

 

 ‘దుర్గం’ చెరువులకు నీరు నింపాలి

 కళ్యాణదుర్గం  నియోజకవర్గంలో ఎలాంటి సాగునీటి వనరులూ లేవు. హంద్రీనీవా ద్వారా  నియోజకవర్గంలోని చెరువులకు నీరు నింపే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతా. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం మరమ్మతుల కోసం అదనంగా రూ.7 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా నిరంతరం గ్రామాలకు నీరందించాలని డిమాండ్ చేస్తా. కళ్యాణదుర్గం నియోజకవర్గం జిల్లాలోనే అత్యంత వెనుకబడి ఉంది.  ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవిస్తా.

 - ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top