సీకే బాబుపై హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభం

సీకే బాబుపై హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభం - Sakshi


చిత్తూరు (అర్బన్):  చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభమయింది. స్థానిక జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం సోమవారం కేసు విచారణ ప్రారంభించింది. డిసెంబర్ 19 వరకు కేసులోని సాక్షులను, నిందితులను విచారించనున్నారు. తొలి రోజు ఈ కేసులోని నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరుకాగా, ముగ్గురు సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి విజయకుమార్ నమోదు చేశారు.  ఈ కేసుకు విచారణ ప్రారంభమవడంతో కోర్టు ప్రాంగణంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

 

ఇదీ కేసు...

2007 ఫిబ్రవరి 9వ తేదీన అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. చిత్తూరులో పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్ద కొందరు ఓ కారులో వచ్చి సీకేను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. సీకే బాబు అంగరక్షకుడు హుస్సేన్‌భాషా, మునిసిపల్ ఉద్యోగి నావరసు మృతిచెందారు. గన్‌మన్లు జరిపిన కాల్పుల్లో హంతక ముఠాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి సైతం మృతి చెందాడు. సీకే బాబు త్రుటిలో తప్పించుకున్నారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన సీఐలు మల్లికార్జున్, అల్లాబక్ష్, సుధాకరరెడ్డి, రవిమనోహర ఆచ్చారి, రాజగోపాల్ 16 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో టీడీపీ నాయకుడు కఠారి మోహన్, చింటూ, సురేష్‌బాబు, సర్దార్, గుర్తుతెలియని వ్యక్తి (చనిపోయిన దుండగుడు), కఠారి ప్రవీణ్‌కుమార్,  శాంత కుమార్, అమర్‌నాథ్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజా, జీఎస్.వెంకటచలపతి, జలకం మురళి, త్రివిక్రమ్, ఏకాబరం ఉన్నారు. వీరిపై న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. సీకే బాబుతో పాటు మొత్తం 94 మందిని సాక్షులుగా చేర్చారు.



సాక్షుల విచారణ...

సాక్షులుగా ఉన్న మాజీ కౌన్సిలర్ కేపీ శ్రీధర్, ప్రస్తుత కార్పొరేటర్ పులిచెర్ల శివప్రసాద్‌రెడ్డి న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పారు. ఓ కేసులో రిమాండు ఖైదీగా ఉన్న కేపీ శ్రీధర్‌ను పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరిచారు. హత్యాయత్నం జరిగినప్పటి విషయాలను శ్రీధర్, శివప్రసాద్‌రెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల ద్వారా న్యాయస్థానానికి వివరించారు. కాగా వచ్చే నెల 19 వరకు జరిగే తొలి షెడ్యుల్ విచారణలో 94 మంది సాక్షులను వారికిచ్చిన తేదీల ప్రకారం ప్రతీ రోజు విచారించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top