స్టాండింగ్ కమిటీ సమావేశం రచ్చ..రచ్చ


చిత్తూరు(ఎడ్యుకేషన్): స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఎస్.గీర్వాణి అధ్యక్షతన డిప్యూటీ సీఈవో మాలతికుమారి ఆధ్వర్యంలో మంగళవా రం 1నుంచి 7వరకు నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశాలు రచ్చరచ్చగా మారాయి. జెడ్పీ చైర్‌పర్సన్ రూ.7కోట్ల రోడ్డు పనులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు తప్పుపట్టడంతో వివా దం మొదలైంది. టీడీపీ జెడ్పీటీసీలు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.



తొలుత 1, 7 స్థాయి సంఘాల సమావేశం ప్రారంభమైంది. అజెండా ప్రాధాన్యతాంశాలపై వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డియాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఏడో అంశంగా పొందుపరచిన చైర్‌పర్సన్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించాలని పట్టుబట్టారు. చైర్‌పర్సన్ ససేమిరా అనడంతో గందరగోళం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత ఇరిగేషన్ శాఖపై చర్చించారు. పనులను ఏ ప్రా తిపదికన ఎంపికచేసి ప్రతిపాదనలు పంపుతారని పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు ఎస్‌ఈ శివరామకృష్ణను ప్రశ్నించారు.



చెట్టు-నీరు పథకంలో చెరువుల అభివృద్ధి చేసే ముందు దాని విస్తీర్ణం ఎంత, ఏవైనా ఆక్రమణలుం డాయా అనే అంశాలను పరిగణనలోకి తీసుకోరా అని తవణంపల్లి జెడ్పీటీసీ వెంకటేశ్వరచౌదరి ప్రశ్నించారు. చెరువు పూడికతీత పనులకు క్యూబిక్ మీటరుకు రూ.29 గిట్టుబాటు కాకపోవడంతో జేసీబీ యజమానులు ముందుకురావడం లేదని జెడ్పీటీసీ వెంకటరెడ్డియాదవ్ అన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల విస్తరణకు ఆక్రమణలు అడ్డుగా మారాయని, వాటిని తొలగించాలని పెనుమూరు జెడ్పీటీసీ రుద్రయ్యనాయుడు కోరారు.



జిల్లాలో పీఆర్ రోడ్ల మరమ్మతుకు సంబంధించి ఎక్కడెక్కడ అవసరమో ప్రతిపాదనలు చేపట్టారా అని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డియాదవ్ ప్రశ్నించారు. పాకాలలో నాలుగేళ్ల కిందట ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నిర్మించారని, దాన్ని వాడుకలోకి తీసుకురావడం లేదని పాకాల జెడ్పీటీసీ సురేష్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శివకుమార్ దృష్టికి తెచ్చారు. అరగొండ-బంగారుపాళెం మార్గంలో రోడ్డుగుంతలమయంగా కనిపిస్తోందని, భక్తులకు ఇబ్బంది తప్పడం లేదని తవణంపల్లి జెడ్పీటీసీ వెంకటేశ్వరచౌదరి తెలిపారు.



బికొత్తకోటలో సర్వేనెం. 479లో ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆక్రమించిన కేసులో హైకోర్టు తీర్పు మేరకు స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బికొత్తకోట జెడ్పీటీసీ రెడ్డెప్పరెడ్డి ఎస్‌ఈని కోరారు. ట్రాన్స్‌కోలో అవినీతి పెరిగిపోతోందని, ఏఈలకు స్థానచలనం చేస్తేగానీ వ్యవస్థ గాడిలో పడదని టీడీపీకి చెందిన జెడ్పీటీసీలు చిట్టిబాబు, రుద్రయ్యనాయుడు, శంకర్ పేర్కొన్నారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి జీపీఎస్ విధానం అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అలాగే రవాణా చార్జీలను పెంచాలని పాకాల జెడ్పీటీసీ సురేష్ కోరారు.



పుంగనూరులో ఇసుక రీచ్‌లను పెట్టమని కలెక్టర్ ఆదేశించినా డీపీవో పట్టించుకోలేదని పుంగనూరు జెడ్పీటీసీ వెంకటరెడ్డియాదవ్ తెలిపారు. రోడ్ల నిర్మాణ నిధులను వైఎస్సార్ సీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న మండలాలకు కేటాయించకపోవడం దారుణమన్నారు. దీనిపై టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు సభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది.

 

ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగానే జరిగింది: నారాయణస్వామి

గతంలో ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ గృహపథక లబ్ధిదారుల ఎంపిక జరిగిందని హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి సభలో చెప్పడంపై జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తీవ్రంగా స్పందించారు. రెండవ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ కమిటీలతో లబ్ధిదారుల ఎంపిక జరిగిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేయడంతో హౌసింగ్ పీడీ ఖంగుతిన్నారు.



మళ్లీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇందిరమ్మ పథకంలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని గుర్తించి ప్రభుత్వానికి పంపలేదా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేదలకు కొత్తగా ఇళ్లు మంజూరయ్యే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. ఎంపీడీవోలు పంపిన పింఛనుదారుల పేర్లు ఎందుకు తొలగించారని డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డిని ప్రశ్నించారు. డీఆర్‌డీఏ పీడీ నీళ్లు నమిలారు.

 

స్టాండింగ్ కమిటీ సమావేశం ఉంటే కలెక్టర్ రివ్యూలేంటి..?

స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుంటే కలెక్టర్ అధికారుల రివ్యూ సమావేశాలు ఎం దుకు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యేతో పాటు సభలో పలువురు సభ్యులు ప్రశ్నించారు. కలెక్టర్ సమావేశం పేరుతో పలువురు అధికారులు స్టాండింగ్ కమిటీ సమావేశానికి రాకపోవడంతో చర్యలకు సిఫారసు చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌కు విన్నవించారు.



గైర్హాజరైన అధికారుల జాబితాను సిద్ధం చేసి వారికి మెమోలు జారీ చేయనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. మూడో స్టాండింగ్ కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు సుం దరరామిరెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. రిజిస్ట ర్లో సంతకాలు చేసిన సభ్యులు సభలో లేకపోవడంతో కోరం లేదని వాయిదా వేశారు. 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం సైతం కోరంలేక వాయిదా పడింది.



నాలుగో స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ మాట్లాడుతూ తిరుపతి తరహాలో స్కూళ్ల లో ఈ-లెట్రిన్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఐదో స్టాండింగ్ కమిటీ సమావేశం కార్వేటినగరం జెడ్పీటీసీ సభ్యురాలు గీత అధ్యక్షతన నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జి పీడీ లక్ష్మి హాజరయ్యారు. సందేహాలను నివృత్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top