ప్రత్యేక హోదా.. సిక్కోలుకు సంజీవనే!

ప్రత్యేక హోదా.. సిక్కోలుకు సంజీవనే! - Sakshi


‘ఇవ్వబోమన్న కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. మనకు కేంద్రమే హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అడిగి సాధించుకోలేమా? వచ్చేవరకూ పోరాడుదాం. ఇచ్చినవారికే మద్దతు ఇద్దాం...’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు గురువారం కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ఆంధ్రుల ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా చాటాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పందించాయి. సిక్కోలు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో సాయంత్రం ఐదు గంటలకు సూర్యమహల్‌ జంక్షన్‌ నుంచి ఏడు రోడ్ల జంక్షన్‌ వరకూ కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు రాజకీయాలకు అతీతంగా యువత పాల్గొని విజయవంతం చేయాలని, ప్రత్యేక హోదా తమ హక్కు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టిగా వినిపించాలని పార్టీ నేతలు కోరారు.



సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:    తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తే తమిళ యువత పోరాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుకూల ఆదేశాలు సాధించుకున్న తార్కాణం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చూశాం. విషయం ఏదైనా పోరాటాన్ని మాత్రం స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదా కోసం నినదించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌ సీపీ సహా విపక్షాలన్నీ పిలుపునిస్తున్నాయి. అయితే విప్లవాలకు పురుటిగడ్డ సిక్కోలువాసుల్లో ఆ స్ఫూర్తి కొత్తకాదు. స్వాతంత్య్ర పోరాటం నుంచి రైతు ఉద్యమాల వరకూ తనదైన ముద్ర వేసుకున్న గడ్డ ఇది. కానీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికీ జిల్లాది వెనుకబాటుతనమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, తెస్తామన్న టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ పల్లవి ఎత్తుకున్నాయి. ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నవంబరులో విశాఖలో జరిగిన ‘జై ఆంధ్రప్రదేశ్‌’ సభలో గణాంకాల సహా వివరించి యువతను ఆకట్టుకున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వ ఆలోచన ప్యాకేజీలతో తృప్తిపడిపోతోంది. తీరా అవీ సక్రమంగా అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో మరో ఉద్యమానికి వైఎస్సార్‌ సీపీ తెరతీసింది.



టీడీపీ ప్రభుత్వం చేసిందేమిటి?...

సుమారు 5,837 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న సిక్కోలు జనాభా 28 లక్షల పైమాటే. నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బాహుదా నదులున్నా ఇప్పటికీ జిల్లాలోని నాలుగు లక్షల హెక్టార్లలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా చెప్పుకోదగిన పోర్టు జిల్లాలో ఒక్కటీ లేదు. కళింగపట్నం, భావనపాడు పోర్టులను భారీ స్థాయిలో నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకొచ్చిన ప్రతిసారి హామీలిస్తున్నా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ప్రభుత్వాధీనంలో ఏర్పాటు చేయాల్సిన భావనపాడు పోర్టును ప్రైవేట్‌ సంస్థ అదానీకి అప్పగించేసింది. భూసేకరణ ఇంకా పూర్తికాలేదు. జపాన్‌ సంస్థ ఆర్థిక సహాయంతో పోలాకిలో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేస్తామని టీడీపీ రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటికీ పత్తా లేదు. చివరకు కాకరాపల్లి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈస్ట్‌కోస్ట్‌ సంస్థ చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడటానికీ టీడీపీ నాయకుల వైఖరి కారణమనేది బహిరంగ రహస్యమే. ఇక సోంపేటలో ఎన్‌సీసీ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం కోసం సేకరించిన 2 వేల ఎకరాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్, అగ్రి బేస్డ్‌ ఇండస్ట్రీస్, ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ భూములను ఎన్‌సీసీ మళ్లీ చేజిక్కించుకొని ప్రమాదకరమైన పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చేస్తుందేమోన్న సందేహాలు స్థానిక ప్రజల్లో నెలకొన్నాయి. పొందూరు దగ్గర కొండపై ఐటీ టవర్స్‌ కడతామని ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా చర్యలే లేవు. పైడిభీమవరం పారిశ్రామికవాడకు ప్రత్యామ్నాయంగా రాజాం, పలాసల్లో పారిశ్రామికవాడలు అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పినా జిల్లాలో ఉన్న పారిశ్రామికవాడల్లోనే లక్షల చదరపు మీటర్ల భూమి ఖాళీగాఉంది. చివరకు ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తిరిగి సహకార రంగంలోనే తెరిపిస్తామని హామీలిచ్చి గత ఎన్నికలలో పబ్బం గడుపుకున్న టీడీపీ నాయకులు... ఇప్పుడు దాని ఉనికికే గండికొట్టారు. కర్మాగారం భూములన్నీ ఏపీఐసీసీకి బదలాయించేసి రైతుల కంట్లో మట్టికొట్టిన సంగతి జిల్లా ప్రజలకు ఎరుకే!



ప్రత్యేక హోదాతో జిల్లాకు మేలు....  

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం నుంచి దండిగా నిధులొస్తాయి. వాటితో జిల్లాలో వంశధార, నాగావళి నదులపై పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి. ప్రస్తుతం వంశధార నదిపై హిరమండలం వద్ద తలపెట్టిన వంశధార ప్రాజెక్టు నిధుల్లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి.



 ►నైరాలో జాతీయ వరి పరిశోధన కేంద్రం గత ఏడాది మంజూరైంది. ఇది ఏర్పాటైతే మేలైన దిగుబడి ఇచ్చే వరి వంగడాలు రైతులకు సమకూరతాయి. వరిసాగును విస్తృతం చేయడానికి అవకాశం ఉంటుంది.

 

 ►కొబ్బరి, జీడిమామిడి ఉత్పత్తులను రైతులు దళారులకు విక్రయించడమే తప్ప వాటిని వాణిజ్య తరహాలో వినియోగించుకొనే అవకాశం లేదు. ప్రత్యేక హోదాతో లభించే రాయితీలతో కొబ్బరి, జీడిమామిడి ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.



 ►జిల్లాలోని విస్తారమైన అటవీ ప్రాంతంలో అనేక రకాలైన అటవీ ఉత్పత్తులు, ఔషధ మూలికలు లభిస్తున్నాయి. వాటి ఆధారిత పరిశ్రమలు జిల్లాలో లేవు. ఐటీడీఏ కేవలం మార్కెటింగ్‌కు మాత్రమే పరిమితమవుతోంది. అలాగాకుండా ఆయా అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు వస్తాయి.



 ► జిల్లాలో కళింగపట్నం, భావనపాడు ఓడరేవులను అభివృద్ధి చేస్తే జీడిమామిడి, కొబ్బరి, వరి ఉత్పత్తులతోపాటు పారిశ్రామిక ఉత్పత్తులు, గ్రానైట్‌ ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది.



 ► జిల్లాలో ప్రస్తుతం గ్రానైట్‌ పరిశ్రమ అంతా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ప్రత్యేక హోదా ద్వారా గ్రానైట్‌ పాలిష్డ్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.



 ► పదివేల మత్స్యకార కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తే మత్స్య సంపద ఆధారిత పరిశ్రమలు, చేపల శీతల నిల్వ కేంద్రాలు ఏర్పాటవుతాయి.



 ► సోంపేట థర్మల్‌ విద్యుత్తు కేంద్రం రద్దయిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అక్కడున్న వెయ్యి ఎకరాల్లో వాణిజ్య తరహాలో అగ్రికల్చర్, ఆక్వా, డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుంది.



 ► జిల్లాలో పైడిభీమవరం పారిశ్రామికవాడ ఒక్కటే ఉంది. అదీ ఫార్మా కంపెనీలకే పరిమితం. రణస్థలం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు.

ప్రత్యేక హోదా వస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయి.



 ► ఆమదాలవలసలో సహకార చక్కెర కర్మాగారం, రావివలసలో ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీ, రాజాంలో నూలు పరిశ్రమలతో పాటు జిల్లాలో ఎనిమిది జూట్‌ మిల్లులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా ద్వారా రాయితీలు, గ్రాంట్‌లు వస్తే ఇలాంటి పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top