కలెక్టరేట్‌కు ఏమైంది?

కలెక్టరేట్‌కు ఏమైంది? - Sakshi


► కీలకమైన ఫైళ్లలో కనిపించనవి కొన్ని, కదలనివి మరికొన్ని!

► సెక్షన్లలో కానరాని  ప్రక్షాళన

► ఏళ్ల తరబడి సీటు వదలని విక్రమార్కులు

► అంతా ఒకటై... ఆడింది ఆట, పాడింది పాట!

► ముగ్గురు ఉన్నతాధికారులొచ్చినా మారని తీరు




సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: కలెక్టరేట్‌... జిల్లా పరిపాలనకు కేంద్ర కార్యాలయం! జిల్లా ప్రగతి వైపు సాగే ప్రతి ప్రస్థానానికీ తొలి అడుగు ఇక్కడి నుంచే! అందుకే ఇక్కడి ఉన్నతాధికారులకే కాదు అన్ని సెక్షన్లలో సిబ్బందికీ అంత విలువ... అంత గౌరవం... అంతే బాధ్యత కూడా! కానీ ఏళ్ల తరబడి ఇక్కడ తిష్టవేసి సీటు వదలని విక్రమార్కుల వల్ల మొత్తం వ్యవస్థపైనే మచ్చ పడుతోంది! అంతా ఒక్కటై తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా వారి వ్యవహారం సాగిపోతోంది! కానీ దీన్ని ప్రక్షాళన చేసి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు ఉన్నతాధికారులు చేసినా ఫలించట్లేదు.



  ఏప్రిల్‌లో కొత్త కలెక్టర్‌గా కె.ధనుంజయరెడ్డి, అంతకు కొద్ది నెలల ముందు జాయింట్‌ కలెక్టరుగా కేవీఎన్‌ చక్రధరబాబు, డీఆర్‌వోగా ఎన్‌.సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. వారి రాకతోనైనా కలెక్టరేట్‌ సెక్షన్లలో ప్రక్షాళన జరుగుతుందని ప్రజలు, ఉద్యోగులు ఆశించినా ఇప్పటివరకూ కానరాలేదు. ఆయా విక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఫైళ్లు సైతం కనిపించకపోవడం, మరికొన్ని కీలకమైన ఫైళ్లు టేబుళ్లపై నుంచి కదలకపోవడమే దీనికో తార్కాణం!



జిల్లా రెవెన్యూ వ్యవస్థకు గుండెకాయ వంటి కలెక్టరేట్‌లో ఏ నుంచి హెచ్‌ వరకూ ఎనిమిది సెక్షన్లతో పాటు లీగల్‌ సెల్, మీ–సేవ, ఐటీ తదితర విభాగాలు ఉన్నాయి. వీటన్నింటిలో వివిధ కేడర్లలో 80 మందికి పైగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఏటా బదిలీల సమయంలో కనీసం 20 మందికైనా బదిలీ జరగాలి. కానీ ఈ ఏడాది జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో ముగ్గురు మాత్రమే కలెక్టరేట్‌ నుంచి బయటకు కదిలారు. మిగతావారంతా ఎప్పటిలాగే ఎవ్వరి సీటును వారు పదిలం చేసుకున్నారు.



వారిలో ఆరేడు సంవత్సరాలుగా కలెక్టరేట్‌లోనే తిష్టవేసిన ఉద్యోగులు పది మంది వరకూ ఉన్నారు. వారు ‘డిప్యుటేషన్‌’ ముసుగులో బదిలీ నుంచి తప్పించుకుంటున్నారు. ఇలా దీర్ఘకాలికంగా కలెక్టరేట్‌లో తిష్టవేసిన సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తమకు అవసరమైన, తమ వారికి ఉపయోగపడే ఫైళ్లను ఆఘమేఘాలపై ఆమోదింపజేసుకుంటున్నారు. తమకు ఇష్టంలేని, తమకు ప్రయోజనంలేని లేదా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఫైళ్లను మాత్రం ఏళ్ల తరబడి తొక్కిపెట్టి ఉంచుతున్నారు. కొన్ని ఫైళ్లు ఏకంగా కనిపించకుండానే పోయాయట!



ప్రక్షాళనతోనే ప్రయోజనం...

కలెక్టర్, జాయింట్‌ కలెక్టరు, డీఆర్‌వో తదితర జిల్లా ఉన్నతాధికారుల మార్పు జరిగినప్పుడల్లా సిబ్బందిలో మార్పులు చేర్పులు చేయడం సహజమైన ప్రక్రియ. తమ పరిపాలన సౌలభ్యం కోసం బదిలీల ద్వారా సిబ్బందిని మార్పు చేసి తమకు చేయూత అందించేవారిని కీలకమైన పోస్టుల్లో నియమించడమూ సహజమే. ఇలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తే ప్రజలకు కొన్ని రోజులైనా సుపరిపాలన, మెరుగైన సేవలు అందుతాయనేది సామాన్యుల ఆకాంక్ష. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. కొత్త కలెక్టర్‌గా  ధనుంజయరెడ్డి గత ఏప్రిల్‌ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 50 రోజుల పాలన పూర్తి చేసుకున్నా కలెక్టరేట్‌లో ప్రక్షాళన దిశగా ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.



నిర్లక్ష్యానికి సాక్ష్యాలు కొన్ని....

∙జిల్లా రెవెన్యూ శాఖలోని ఉద్యోగులపై సస్పెన్షన్లు, వారి క్రమశిక్షణారాహిత్యంపై దర్యాప్తు ఆదేశాలకు సంబంధించిన ఫైళ్లు సుమారు 125 వరకు ఉన్నాయి. ఇవి కలెక్టరేట్‌లోని ‘ఎ’ సెక్షన్‌లో కనీసం ఐదారేళ్లుగా పెండింగ్‌లో మగ్గుతున్నాయి. దర్యాప్తులకు సంబంధించిన ఫైళ్లు కనిపించకుండాపోయాయి. ఈ ఫైళ్లన్నీ తనముందు ఉంచితే పరిష్కరిస్తానని గత కలెక్టరు పి.లక్ష్మీనరసింహం పలుమార్లు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన దృష్టికి ఏ ఒక్క ఫైల్‌ కూడా వెళ్లకపోవడం గమనార్హం. కనీసం ఆ ఫైళ్లకు సంబంధించిన జాబితాను నేటికీ రూపొందించ లేదంటే ఆ విభాగం పనతీరుకు అద్దం పడుతోంది.



∙పౌర సరఫరాల విభాగంలో దాదాపు 32 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని 6ఏ కేసులు ఉన్నాయి. మరికొన్ని రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తూ తెలుపురంగు రేషన్‌ కార్డును వినియోగించడంపైనా నమోదైన కేసులు ఉన్నాయి. నెలకు రూ.30 వేలకు పైబడి ఆదాయం ఉన్నా తెల్లకార్డు పొందడమే గాక దీంతో చౌక దుకాణాల్లో సరుకులు తీసుకోవడం, పిల్లల చదువుకు ఫీజు రాయితీ పొందిన కేసులు ఉన్నాయి. ఈ అక్రమాలకు సంబంధించిన ఫైళ్లు ఏవీ ఇప్పుడు కలెక్టరేట్‌లో కనిపించకుండాపోయాయి.  



∙ రెవెన్యూ శాఖలో కళ్లకు కనిపించని కంప్యూటర్‌ ఆపరేటర్లు కూడా ఉన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 71 మందిని మాత్రమే నియమించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. కానీ 77 మందితో పని చేయిస్తున్నట్లుగా లెక్క చూపిస్తున్నారు. వారికి ఇటీవల మూడు నెలల జీతాలు విడుదలయ్యాయి. చెల్లింపుల విషయం వచ్చేసరికి అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకు మాత్రం 52 మందికి మాత్రమే డ్యూటీ సర్టిఫికెట్‌లు వెళ్లాయి. ఈ వ్యత్యాసాల వెనుక ఉన్న గమ్మత్తు ఏమిటో అధికారులకే ఎరుక!



∙ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గత పది నెలలుగా కారుణ్య నియామకాలు జరగలేదు. గత కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం స్పందించి ఈ నియామకాలకు సంబంధించిన ఫైల్‌ వారం రోజుల్లో తన ముందు ఉంచాలని ఆదేశించారు. అలా ఆదేశించి రెండు నెలలైనా అది మాత్రం జరగలేదు. ఆయన బదిలీ తర్వాత కొత్త కలెక్టరుగా వచ్చిన ధనుంజయరెడ్డి ముందుకి కూడా ఆ ఫైల్‌ ఇప్పటివరకూ రాలేదు. ఇటీవల ఈ కారుణ్య నియామకాలకు సంబంధించిన బాధితులు ఆయనకు విన్నవించుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఆదేశాలిచ్చినా ఫైల్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కటే అన్నట్లుగా ఉంది.



∙ జిల్లా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి తహసీల్దారు వరకు అన్ని కేడర్లలోని ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సీనియారిటీ జాబితాలు రూపొందించాల్సిన బాధ్యత సంబంధిత సెక్షన్‌ సిబ్బందిదే. కానీ ఇప్పటివరకూ ఏ కేడర్‌లోనూ కచ్చితమైన సీనియారిటీ జాబితాలు సిద్ధం కాలేదు. దీంతో పదోన్నతుల వ్యవహారం మరింత జాప్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top