శ్రీకృష్ణాపురం మేట్రిన్ సస్పెన్షన్


పాడేరు : పాడేరులోని శ్రీకృష్ణాపురం బాలికల ఆశ్రమ పాఠశాల మేట్రిన్ బి.భువనేశ్వరిని సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కోటేశ్వరరావును లోతుగెడ్డ ఆశ్రమానికి బదిలీ చేశారు. మెనూ సక్రమంగా అమలుచేయలేదని, రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని  శ్రీకృష్ణాపురం బాలికల ఆశ్రమ పాఠశాల మేట్రిన్‌పై అధికారులకు ఫిర్యాదులందాయి. ఏజెన్సీలో తుపాను బాధితులను సందర్శించేందుకు వచ్చిన చంద్రబాబు తొలుత ఈ శ్రీకృష్ణాపురం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.



రెండు రోజుల తరువాత సందర్శించిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నిర్వహణ సక్రమంగా లేదంటూ మేట్రిన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడే విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి మెనూ సక్రమంగా అమలు చేయడం లేదంటు మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు జాప్యం చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలపై అధికంగా ఫిర్యాదులు రావడంతో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.



విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారంలో నాణ్యత లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల రికార్డులు సవ్యంగా లేకపోవడం, స్టాక్ రిజిస్టర్, విద్యార్థుల హాజరులో తేడాలను ఎమ్మెల్యే గుర్తించారు. దీనిపై తక్షణం విచారణ జరపాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, గిరిజన సంక్షేమ డీడీలను కోరారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి మేట్రిన్ భువనేశ్వరిని సస్పెండ్ చేశారు. అలాగే హెచ్‌ఎం కోటేశ్వరరావును బదిలీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top