అకాడమీలతో.. ‘ఆట’పట్టు

అకాడమీలతో.. ‘ఆట’పట్టు - Sakshi


 శ్రీకాకుళం స్పోర్ట్స్:సిక్కోలు ఇక క్రీడల ఖిల్లాగా వెలుగొం దనుంది. పలు శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వస్థాయిలో దాదాపు నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లా క్రీడాకారులకు మంచిరోజులు రానున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా దీనికి సంబంధించి అన్ని వివరాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడం దాదాపు ఖరారు కాగా.. తాజాగా రెండు స్పోర్ట్స్ అకాడమీలు మంజూరైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. హాకీ, ఫుట్‌బాల్ క్రీడలకు సంబంధించిన అకాడమీలను జిల్లాకు కేటాయిం చారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక, క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు శాప్ ఎండీకి లేఖ రాసినట్లు సమాచారం. దాంతో అకాడమీల ఏర్పాటుకు సంబంధించి కొద్దిరోజుల్లోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇక్కడ అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీలను నిర్వహించేవారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో దాదాపు నాలుగేళ్ల క్రితమే ఇవి మూతపడ్డాయి. ఇంతకాలానికి మళ్లీ స్పోర్ట్స్ అకాడమీలు జిల్లాకు మంజూరు కానుండటంపై ఆయా క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, ఆ సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 కేఆర్‌స్టేడియంలోనే..

 కాగా కొత్తగా మంజూరు కానున్న రెండు అకాడమీలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై అధికారవర్గాలు త ర్జనభర్జనలు పడుతున్నాయి. అయితే జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉన్నకోడిరామ్మూర్తి స్టేడియంలోనే నిర్వహించాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. మైదానం, కోచ్‌తోపాటు డీఎస్‌ఏ ప్రత్యేక గదులు అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ఏర్పాటు చేస్తేనే క్రీడాకారులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. శిక్షణ కోసం ఒక్కో అకాడమాకి 50 మంది వరకు క్రీడాకారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే రెండు అకాడమీలకు కలిపి 100 మంది వరకు ఉంటారు. దీంతో వీరందరకీ వసతి, భోజన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాలికలు సైతం అకాడమీలో ఉంటారు కనుక అందరికీ ఒకేచోట వసతి కల్పిస్తే బాలికలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేమన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఒక అకాడమీని ఐటీడీఏ పరిధిలోని సీతంపేట లేదా మల్లి ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు.

 

 క్రీడాసంఘాల పెదవి విరుపు..

 ఇదిలా ఉండగా జిల్లాలో డీఎస్‌ఏ తరఫున ఎన్‌ఐఎస్ పూర్తిచేసిన శిక్షకులు ఉన్నారన్న నెపంతో తక్కువ ఆదరణ ఉన్న హాకీ, ఫుట్‌బాల్ అకాడమీలు మంజూరు చేస్తుండటంపై మిగిలిన క్రీడాసంఘాల ప్రతినిధులు, పీడీలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, తైక్వాండో క్రీడాంశాలకు మంచి ఆదరణ ఉంది. వీటిని కాకుండా ఆదరణ లేని క్రీడా అకాడమీలు ఎందుకని పీఈటీలు, క్రీడాసంఘాల ప్రతినిధులు                ప్రశ్నిస్తున్నారు.

 

 ఉత్తర్వులు రావాల్సి ఉంది : జూన్ గెల్యూట్, డీఎస్‌డీవో

 జిల్లాకు రెండు స్పోర్ట్స్ అకాడమీలు మంజూరు చేస్తున్నమాట వాస్తవమే. శిక్షకులు ఉన్న క్రీడాంశాల జాబితా పంపించాం. మంత్రి అచ్చెన్నాయుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖలు రాశారు. దాదాపు  మంజూరైనట్లే. అధికారికంగా ఉత్తర్వులు అందాల్సి ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top