చాయ్‌ చమక్‌

చాయ్‌ చమక్‌


టీ, కాఫీలు లేనిదే మాట వినని మనసు

జిల్లాలో పెరిగిన కేఫ్‌ సంస్కృతి


రకరకాల రుచులతో ఆహ్వానం

కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం

పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ

స్నేహితులు కలిస్తే ఇదే పార్టీ




ఒరుకులు పరుగుల జీవితం. అడుగడుగునా అడ్డంకులు.. అవాంతరాలు. ఈ రోజు గడిచిందనుకుంటే.. రేపు మరో గండం ఉండనే ఉంటుంది. పోటీ ప్రపంచంలో ప్రతి విషయంలోనూ పరుగెత్తాల్సిన పరిస్థితి. పాఠశాలకు వెళ్లడం మొదలు.. ర్యాంకుల వేట.. ఉన్నత విద్య.. కోరుకున్న కొలువు.. జీవితంలో స్థిరపడటం.. కుటుంబం.. పిల్లలు.. ఇలా ఒత్తిడి దైనందిన జీవితంలో భాగమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. జీవితమే ఓ చదరంగం.



ఇలాంటి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో మనసు కాస్త ఊరట కోరుకోవడం సహజం. అదెలా అంటే.. ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది టీ. ఉదయం లేవగానే.. మంచం దిగకుండానే.. గొంతులో కప్పు కాఫీ తాగనిదే శరీరం స్వాధీనంలోకి రాదంటే అతిశయోక్తి కాదు. కార్యం ఏదయినా.. కారణం ఎవరైనా.. కాలంతో పని లేకుండా టీ లేనిదే మనసు మనిషి మాట వినదు. నలుగురు కలిస్తే చాలు.. నాలుక కోరుకునే రుచి ఇదే. ఒక్క టీ రూ.5 అన్న మాటే కానీ.. మొత్తంగా లెక్కేస్తే ఇది కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం. టీ, కాఫీలతో పాటు లెక్కకు మించిన రకాలు.. రుచులతో ఈ తేనీరు ఆహా అనిపిస్తోంది.



కప్పుడు ఆలయాలు, మసీదులు, పార్కుల్లో కూర్చుని యోగక్షేమాలు, కుటుంబ సమస్యలు చర్చించుకుంటూ ప్రజలు గడిపేవారు. రానురానూ పరిస్థితుల్లో మార్పులు  చోటు చేసుకున్నాయి. నలుగురు కలిస్తే చాలు ఓ హోటల్‌కెళ్లి కాఫీ, టీ తాగి వచ్చే వరకు తనవి తీరదు.  కాలానుగుణంగా ట్రెండ్‌లో కూడా మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే ‘కేఫ్‌ కల్చర్‌’ అనంతను తాకింది. ఇప్పటిదాకా  పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే ఛాయ్‌ కేఫ్‌లు నేడు జిల్లాలోనూ విస్తరించాయి. అయితే మిగిలిన ప్రాంతాల కంటే  ‘అనంత’ టీకేఫ్‌లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.



సువిశాల మైదానంలో..

జిల్లాలో టీ కేఫ్‌లు సువిశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. నీడ కోసం పైభాగాన రేకుల కప్పు వేస్తున్నారు. తక్కినదంతా ఓపెన్‌ప్లేస్‌గా ఉంటుంది. దీనికి తోడు కేఫ్‌లు చాలా వరకూ నగర నడిబొడ్డున ఉండడంతో ఎంత సేపు కూర్చొన్నా అడ్డు చెప్పే వారు ఉండరు. అంతేకాక వైఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంచడంతో చాలా మంది కేఫ్‌లలో గడపడంపై  ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా బైకులు పెట్టుకునేందుకు కూడా పార్కింగ్‌ సదుపాయం ఉండడంతో విద్యార్థులు, యువతకు కేరాఫ్‌గా కేఫ్‌లు మారుతున్నాయి. ఈ కేఫ్‌లో ఉన్నంత సేపు ఎవరి లోకం వారిదే. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ రాజకీయాలు మాట్లాడుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, డబ్బు లావాదేవీలు, జీవనోపాధుల గురించి, చర్చ, విద్యాసమాచారం అందిపుచ్చుకోవడం. ఉద్యోగావకాశాలపై చర్చ... ఇలా ఎంత సేపు గడిచిందో కూడా తెలియని స్థితిలో యువతతో పాటు ఉద్యోగ, వ్యాపారులు కేఫ్‌లో గడిపేస్తుంటారు. మరికొందరు స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తారు.



సీసీ కెమరాల నిఘా

కొన్ని కేఫ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు టీకేఫ్‌ నిర్వాహకులపై నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ప్రతి కేఫ్‌లోనూ సీసీ కెమరాలు అమర్చాలని నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా కేఫ్‌ల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. వీటివల్ల మంచి ఫలితాలున్నాయని, గొడవలు, ఇతర ఇబ్బందులు లేకుండా పోయాయని కేఫ్‌ల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.



ఆరోగ్యాన్ని మేలు చేకూర్చే చాయ్‌

కేవలం టీ, కాఫీ, బూస్ట్‌లకే పరిమితం కాకుండా ఆరోగ్య రక్షణలో భాగంగా వచ్చిన రాగిమాల్ట్, లెమన్‌ టీ, గ్రీన్‌టీ, అల్లం పాలు, హనీ మిల్క్‌ తదితర రకాలు ప్రస్తుతం టీ కేఫ్‌ల్లో అందుబాటులో ఉంచారు. రాగిమాల్ట్‌ ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి.  శరీరంలో ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు బీపీ, షుగర్‌ కూడా నియంత్రణలో ఉంచుతుండడంతో రాగిమాల్ట్‌కు డిమాండ్‌ బాగానే ఉంటోంది.  



బ్లాక్‌ టీ ప్రత్యేకం

బ్లాక్‌ టీ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని పరిశోధకుల అంచనా. బ్లాక్‌టీలో కేఫిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇతర టీలతో పోల్చుకుంటే ఈ టీ వాసన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది తాగడం వల్ల గుండె సంబంధింత రుగ్మతలు తగ్గుతాయని, ఎముకల బలపడడంతో పాటు శరీరంపై ఏర్పడే మచ్చలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.



అల్లం టీ

ఉదయం అల్లం టీ తాగితే ఆ రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే అల్లం టీ తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్‌ పెట్టినట్లు ఉంటుందని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. ఇందులో యాంటి యాక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల రోజూ ఒక కప్పు అల్లం టీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందని పేర్కొంటున్నారు.  



లెమన్‌ టీ

రోజూ లెమన్‌ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జీవ క్రియలను మెరుగు పరిచేందుకు దోహదపడుతుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు లెమన్‌ టీ ఒక కప్పు తాగితే తక్షణమే రిలాక్స్‌ పొందవచ్చు.



గ్రీన్‌ టీ టేస్టే వేరు

రుచితో పాటు పలు రకాలుగా మెరుగైన ఆరోగ్యానికి గ్రీన్‌ టీ ఉపయోగపడుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.  గ్రీన్‌ టీ తాగడం వల్ల మెదడులో చురుకుదనం పెరుగుతుందనే వాదన కూడా ఉంది. కేన్సర్‌ కారకాలను కూడా వ్యతిరేకించే గుణం ఈ టీ ప్రత్యేకం. కీళ్ల నొప్పుల నివారణతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.



రోజూ రూ. కోటికి పైగా టీ వ్యాపారం

జిల్లా వ్యాప్తంగా  టీ కేఫ్‌లలోనే రోజుకు సగటున రూ. 40 లక్షల వరకూ టీ వ్యాపారం సాగుతోంది. ఇక హోటళ్లు, టీస్టాళ్లను కలుపుకుంటే రోజుకు రూ. కోటికి పైగా టీ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. రోజూ 20 లీటర్లు మొదలుకుని 60 లీటర్ల దాకా పాలు ఖర్చయ్యే కేఫ్‌లు కూడా జిల్లాలో ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top