స్వాతంత్య్రపోరులో విజయనగరం

స్వాతంత్య్రపోరులో విజయనగరం - Sakshi


విజయనగరం... విప్లవాలకు... ఉద్యమాలకు... విజయాలకు ఆలవాలం. నాటి స్వాతంత్య్ర సంగ్రామంలో విజయపథాన నిలిపిన  పౌరుషం ఇక్కడి ప్రత్యేకం. బ్రిటిష్‌ పాలకులపై కణకణమండే  నిప్పుకణికలై ఉద్యమించి... నాటి కుతంత్రాలపై అలుపెరుగక పోరాడిన సాయుధులు... త్యాగధనుల పురిటిగడ్డ ఈ నేల. కలాన్ని చురకత్తిగా మలిచి బానిస బతుకులపై అక్షరయుద్ధం చేసిన యోధులకు... తెల్లవారి నిరంకుశ విధానాలపై ఎదురొడ్డి నిలిచిన సాహసికులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఈ విజయనగరం. అల్లూరి ఆశ్రమ పేరుగా, స్వేచ్ఛా వాయువు లు సాధించుకున్న విజయనగరం నాటి స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పరచుకుంది. ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులను, ఆటుపోట్లను తట్టుకుని నేటికీ ప్రత్యేక గుర్తింపుకోసం పరితపిస్తోంది. స్వాతంత్య్రదినోత్సవం సంద్భంగా ప్రత్యేక కథనం.



సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కటక్‌ నుంచి పిఠాపురం వరకూ విస్తరించిన కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే విజయనగర ప్రాంతం బలమైన నాగరికత పునాదులపై నిర్మితమైంది. 1565లో కళ్లికోట యుద్ధంతో గోల్కొండ నవాబుల ఏలుబడిలోకి వెళ్లింది. ఫౌజిదారుల కాలంలోనే విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు పుట్టుకొచ్చాయి. నిజాం మరణం తర్వాత ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ సాయంతో సలాబత్‌జంగ్‌ అధికారంలోకి వచ్చాడు. దానికి ప్రతిగా శ్రీకాకుళం నుంచి కొండపల్లి సర్కారు వరకూ నాలుగు సర్కార్లను ఫ్రెంచ్‌ వారు రాయించుకున్నారు.



కానీ తర్వాత ఈ ప్రాంతమంతా తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా ఆంగ్లేయుల వశమైంది. 1757 జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నేటికీ ఓ సంచలనం. ఈ యుద్ధం తర్వాత మొదలైన చిన విజయరామరాజు పాలనపై ఈస్ట్‌ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. దానికి ఆయన ఎదురు తిరిగారు. 1794లో తిరుగుబావుటా ఎగురవేశారు. అదే పద్మనాభ యుద్ధం.



ఈ యుద్ధంలో విజయనగర రాజులు ప్రాణాలు వదిలారు. కానీ అప్పటి మద్రాసు గవర్నర్‌ విజయనగరం కోటను చివరి విజయరామరాజు తనయుడు గజపతికి అప్పగించారు. అప్పుడే విజయనగర సాంస్కృతిక శకం మొదలైంది. నిజానికి జాతీయోద్యమ కాలంలోనే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్‌ ఉండేది. కానీ బ్రిటీష్‌ పాలకులు దానిని పట్టించుకోలేదు. దీంతో 1979 వరకూ విశాఖ జిల్లాలో అంతర్భాగంగానే ఉండిపోయింది.



సిపాయిల తిరుగుబాటులో చేయికలిపి

బ్రిటిష్‌ పాలనపై తొలి స్వతంత్ర సంగ్రామంగా పేరుగాంచిన 1830 సిపాయిల తిరుగుబాటునుంచే ఈ జిల్లాలో విప్లవం రాజుకుంది. ముఖ్యంగా గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. గిరిజన ప్రాంత ప్రత్యేక పాలన (ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్‌) ఉద్యమం చెలరేగింది. సాలూరు ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు కొర్రా మల్లయ్య 1900లో విప్లవ జెండా ఎగురవేశారు. ఈ విప్లవాన్ని బ్రిటిష్‌ పాలకులు దారుణంగా పోలీస్‌ చర్యతో అణచివేశారు. ఎంతో మంది గిరిజనుల ప్రాణాలు తీశారు. కొర్రా మల్లయ్య, అతని కుమారుడిని అరెస్ట్‌ చేసి చనిపోయేంత వరకూ జైలు శిక్ష విధించారు. 1905లో బెంగాల్‌ విభజన, 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలు కీలక భూమిక పోషించారు.



దండి సత్యాగ్రహంలో పిడికిలి బిగించి...

1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభమైన మహాత్మా గాంధీ నేతృత్వంలో సత్యాగ్రహయాత్ర 375 కిలో మీటర్లు సాగి ఏప్రిల్‌ 6న దండి గ్రామం చేరింది. 24 రోజుల పాటు సాగిన ఉప్పు సత్యాగ్రహంలో విజయనగరం పాలుపంచుకుంది. గాంధీజీతో అడుగులు కలపకపోయినా దండి యాత్రకు మద్దతుగా విజయనగరంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటైంది. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్న సమయంలోనే ఇక్కడా సత్యాగ్రహం జరిగేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి నాటి పాలకులు జిల్లా వ్యాప్తంగా అనేక అడ్డంకులు కల్పించారు. అయినప్పటికీ మన జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు విజయవంతం చేసి గాంధీజీకి బాసటగా నిలిచారు.



అల్లూరి ఆశ్రమ నామం

తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై... గిరిజనం గుండెల్లో ప్రత్యక్ష దైవమై... స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతియై... వెలిగిన మన్యం వీరుడు అల్లూరి సీతామరామరాజు నాడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల మన్యం ప్రాంతంలో గిరిజనుల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించాడు. ఆయన మదిలో విజయనగరం పేరు మెదలడం గొప్ప విశేషం. విద్యాభ్యాసం అనంతరం 1921లో చిట్టగాంగ్‌ వెళ్లి బెంగాల్‌ విప్లవకారులతో చర్చలు జరిపి కృష్ణదేవిపేట సమీపంలో తాండవ నది ఒడ్డున నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ‘శ్రీరామ విజయనగరం’ అనే ఆశ్రమాన్ని అల్లూరి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతో పాటు చింతపల్లి తహసీల్దార్‌ సెబాస్టియన్, అతని కాంట్రాక్టర్‌ సంతానం పిళ్‌లై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top