గిరిజన తండాలకు మహర్దశ!

గిరిజన తండాలకు మహర్దశ! - Sakshi


మాచర్ల టౌన్: ఎన్నికల సమయంలో 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు గిరిజనతండాల్లో జనాభా సర్వే చేయిస్తోంది. వారం రోజుల కిందట ప్రభుత్వం ఆయా గ్రామాల్లో గిరిజనులకు సంబంధించిన జనాభాను లెక్కించి అందుకు సంబంధించి నివేదిక అందించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను కోరింది. 500మంది జనాభా ఉంటే గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసేందుకు నివేదికలు అడిగినట్లు మండల అధికారులు చెబుతున్నారు.



అందులో భాగంగా మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో తండాల్లో జనాభా లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం మాచర్ల మండలం లచ్చంబావి పంచాయతీ కింద ఉన్న రేగులవరంతండాలో 770 మంది జనాభా, అచ్చమ్మకుంటతండాలో 1116మంది , కొప్పునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని హస్నాబాద్‌తండాలో 828మంది, బెల్లంకొండ వారిపాలెం పరిధిలోని పెద్దఅనుపు, చెంచు కాలనీల్లో 732మంది గిరిజన జనాభా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.



ఈ నాలుగు తండాల్లో గిరిజనులు 500మందికి మించి ఉండడంతో మాచర్ల మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్ల పరిధిలోని మొరసపెంటతండాలో 1079 మంది, గంగలకుంట పరిధిలోని హనుమాపురం, రామచంద్రాపురంతండాల్లో 1095 మంది, లోయపల్లి పరిధిలోని పిచ్చయ్యబావితండాలో 568 మంది, ఉప్పలపాడు పరిధిలోని చినపర్లపాయతండాలో 735 మంది, వజ్రాలపాడు పరిధిలోని దావుపల్లితండాలో 465మంది జనాభా ఉన్నట్లు మండల అధికారులు లెక్కలు తేల్చారు.



దావుపల్లి తండాలో మరో 35మంది తక్కువ ఉన్నా ఈ ఐదు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దుర్గి మండలంలోని నెహ్రూనగర్‌తండాలో 700 మంది పైగా జనాభా, రెంటచింతల మండలంలోని జెట్టిపాలెంగ్రామ పంచాయతీ పరిధిలో 500 మందిపైగా గిరిజన జనాభా ఉన్నారు. ఈ విధం గా దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాల్లో ఐదు తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. ప్రభుత్వం చేయిస్తున్న సర్వే దుర్గి, రెంటచింతల మండలాల్లో ఇంకా పూర్తికాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top