స్పెషల్ ప్యాకేజీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి


  •  ఈఈ, డీఈఈల సమావేశంలో పీఆర్ ఎస్‌ఈ

  • చిత్తూరు(టౌన్): జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కానున్న స్పెషల్ ప్యాకేజీ పనులకు వె ంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీరాజ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ హమీద్‌బాషా తెలిపారు. బుధవారం చిత్తూరులోని పీఆర్ ఎస్‌ఈ కార్యాలయంలో ఆయన జిల్లాలోని పీఆర్‌ఐ, పీఐయూ విభాగాల పరిధిలోని ఈఈలు, డీఈఈలతో సమావేశమయ్యారు.



    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసే నాబార్డు, పీఎంజీఎస్‌వై, బీఆర్‌జీఎఫ్, 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు కూడా స్పెషల్ ప్యాకేజీ పనులను మంజూరు చేస్తామని ప్రకటించిందన్నారు.



    దాంతో రానున్న ఐదేళ్ల ప్రణాళికలను ఈ స్పెషల్ ప్యాకేజీ పనుల ద్వారా చేపట్టనుందని పేర్కొన్నారు. అయితే ఈ పథకం కింద ఇప్పటివరకు చేపట్టి అసంపూర్తిగా వున్న భవనాలను కూడా చేపట్టవచ్చని వివరించారు. అలాగే ఇప్పటివరకు తాగునీటి అవసరాలకే ఉపయోగిస్తున్న బీఆర్‌జీఎఫ్ నిధులను ఇకపై తారురోడ్ల నిర్మాణాలకు కూడా ఖర్చు పెట్టొచ్చని తెలిపారు. అయితే ఈ స్పెషల్ ప్యాకేజీ కింద కేంద్రం మంజూరు చేసే నిధులు ఖర్చయ్యేసరికి మంజూరవుతూనే వుంటాయని, దానికనుగుణంగా మనం కూడా పని చేయాలని ఆయన ఈఈలు, డీఈఈలను కోరారు.



    మండల కమిటీల ద్వారా మండలాల్లో వున్న చెక్‌డ్యాముల వివరాలను సేకరించాలన్నారు. సేకరించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా జీపీఆర్‌ఎస్‌లో పెట్టాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వున్న రోడ్ల పేర్లు, వాటి పొడవు, అవి తారురోడ్లా, సిమెంట్ రోడ్లా, మట్టిరోడ్లా అనే వివరాలను జీఐఎస్ (జియోగ్రాపికల్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్) ద్వారా సేకరించి ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. ఇవన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top