ప్రత్యేక నిధులు నీటిపాలు


ఓహెచ్‌ఆర్‌ల రిపేర్లకు రూ.1.57కోట్లు

పనులన్నీ ఐదులక్షల లోపే

అవసరం లేని చోటు వృథాగా ఖర్చు


 

విశాఖపట్నం : రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని జిల్లాలకు కేంద్రం కేటాయించిన నిధులను కొన్నిశాఖలు అర్థంపర్థంలేని పనులకు కేటాయిస్తున్నాయి. రెండు విడతల్లో రూ.100 కోట్లు జిల్లాకు విడుదల కాగా..తొలివిడతలో మంజూరైన నిధుల్లో రూ.42 కోట్లు వివిధ శాఖలు ప్రతిపాదించిన పనులకు కేటాయించారు. ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధకశాఖ, డ్వామా, వ్యవసాయ, ఉద్యానవనశాఖలు కనీస అవసరం లేనిచోట్ల వృథాగా ఖర్చుచేసేందుకు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్‌కు కేటాయించిన రూ.1.57కోట్లలో రూ.కోటి ఓహెచ్‌ఆర్ ట్యాంకుల మరమ్మతులకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. మూలనపడ్డ 13 పీడబ్ల్యూఎస్ స్కీంల పునరుద్ధరణకు రూ.57.2 కోట్లు కేటాయించిన ఈ శాఖ శిథిలావస్థకు చేరిన 31 ఓహెచ్‌ఆర్ ట్యాంకుల మరమ్మతుల కోసమంటూ రూ.కోటి కేటాయించింది. ఒకటిరెండు పనులు మినహా మిగిలిన పనులకు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలలోపే కేటాయింపులు జరిగాయి. డుంబ్రిగుడ మండలంలో ఏడు పీడబ్ల్యూఎస్ స్కీంల పునరుద్ధరణకు రూ.41 లక్షలు, పెదబయలు మండలంలో రెండు స్కీంలకు రూ.5.70 లక్షలు, కోటవురట్ల మండలంలో మూడు పథకాలకు రూ.5.50 లక్షలు, పాయకరావుపేట మండలం పాల్తేరు వద్ద నిరుపయోగంగా ఉన్న పీడబ్ల్యూఎస్ స్కీం పునరుద్ధరణకు రూ.5లక్షలు కేటాయించారు.



ఇక ఓహెచ్ ఎస్‌ఆర్ ట్యాంకుల మరమ్మతుల పేరిట బుచ్చెయ్యపేట మండలంలో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనాతో మూడు పనులకు ప్రతిపాదించారు. రావికమతం మండలంలో రూ.8.20 లక్షలతో 4 పనులకు, దేవరాపల్లి మండలంలో రూ.5.50 లక్షలతో ఐదు పనులకు, పాడేరులో 8 పనులకు రూ.21లక్షలు, పెదబయలు మండలంలో ఆరులక్షలతో రెండు పనులకు, రూ.2.50 లక్షల అంచనాతో బుచ్చెయ్యపేట,నక్కపల్లి మండలాల్లో ఒక్కొక్కటి, పాయకరావుపేటలో మూడు, కోటవురట్ల, పరవాడ లలో ఒక్కొక్కటి,పెందుర్తి రెండుపనులకు ప్రతిపాదించారు. దాదాపుఈ ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ట్యాంకులైతే కనీస మరమ్మతులకు సైతం నోచుకోని దుస్థితి. అలాంటి శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకు సైతం ప్రత్యేక మరమ్మతుల పేరిట ఈ ప్రత్యేక నిధులు కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది.



జర్మన్ టెక్నాలజీతో వీటిని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నప్పటికీ వీటిలో చాలా వరకు కనీసమరమ్మతులకు పనికిరానిస్థితిలో ఉన్నాయి. రూ.లక్షలుపోసివీటికి పైపై మెరుగులు దిగ్గినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మళ్లీ కొద్దిరోజుల్లోనే శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జీర్ణావస్థలో ఉన్న ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులకు మరమ్మతుల పేరిట లక్షలు వెచ్చించే బదులు వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మేలన్న వాదన వినిపిస్తోంది.

 

మరో పదేళ్లు ఢోకా ఉండదు

పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ జర్మన్ టెక్నాలజీ ద్వారా మరమ్మతులు చేయడం వల్ల కనీసం పదేళ్ల పాటు వినియోగంలోకి తీసుకురావచ్చు. జీర్ణావస్థలో ఉన్న ట్యాంకులోని ఇనుప ప్రేమ్‌లకు పోర్స్‌రాక్ మెటీరియల్, జియోబ్యాండ్ కెమికల్‌ను అప్లై చేసి తిరిగి రంగు, సిమ్మెంట్ పూత వేస్తే చాలు..పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. సొమ్ములు వృధా కావు..

 -తోట ప్రభాకరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top