ప్రజాప్రతినిధులకే మరుగుదొడ్లు లేవు


ప్రజాప్రతినిధులకే మరుగుదొడ్లు లేవు

 10,628 మందికి గాను

 ఉన్నది 2,647మందికే

 బహిరంగ మల విసర్జన చేస్తున్న 7621 మంది కుటుంబాలు

 

 స్వచ్ఛ భారత్ అన్న నినాదం దేశమంతటా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఏ నేత చూసిన చేత చీపురుపట్టుకుని పత్రికలకు ఫోజులిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో   ప్రత్యేక కమిటీలను కూడా నియమించారు. జిల్లాలో ప్రతి ఇంటిలో తప్పని సరిగా మరుగుదొడ్డి ఉండాలని ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాలో సామాన్య, పేద ప్రజల విషయాన్ని విడిచిపెడితే సమాజానికి మార్గదర్శకులుగా ఉండవలసిన ప్రజాప్రతినిధులే ఇంకా ఆరుబయటకు వెళుతున్నారు. జిల్లాలో 7,621 మంది ప్రజాప్రతినిధుల ఇళ్లకు మరుగుదొడ్లు లేవు అంటే నమ్మకతప్పదు. ఇది నిజంగా సిగ్గుపడవలసిన విషయమే....

 

 విజయనగరంఫోర్ట్:  జిల్లాలో ప్రజలకే కాదు , ప్రజాప్రతినిధులకు కూడా మరుగుదొడ్లు లేవు. సగంమందికి పైగా ప్రజాప్రతినిధులకు మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్లు కట్టండని ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన ప్రజాప్రతినిధులు వాటిని వినియోగించడం లేదు. ఇక ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. బహిరంగ మలసవిసర్జన వల్ల అనేక  ఆరోగ్య సమస్యలు  వస్తాయని తెలిసి కూడా ప్రజాప్రతినిధులు మరుగుదొడ్లు  వినియోగించడం లేదు. జిల్లాలో ఎంపీటీసీ, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు ఎంపీపీలు, వార్డు మెంబర్లు కలిసి 10,628 మంది ఉన్నారు. వీరిలో మరుగుదొడ్లు ఉన్నది కేవలం 2,647 మందికి మాత్రమే. 7,621మందికి మరుగుదొడ్లు లేవు, వీరంతా ఇప్పటికీ   బహిరంగ మలసవిసర్జనకు పాల్పడుతున్నారు.

 

  ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని భావించిన కేంద్ర , రాష్ర్ట ప్రభుత్వాలు సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో జిల్లా ప్రజాప్రతినిధుల వివరాలను కూడా నమోదు చేశాయి. అప్పుడే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరిటి జిల్లాలో లక్ష మరుగుదొడ్లు జిల్లాలో నిర్మించాలని తలపెట్టింది.   ఇసుక  దొరకపోవడం, నిర్మాణ సామాగ్రి ధర పెరిగిపోవడం తదితర కారణాల వల్ల ప్రజలు మరుగుదొడ్లు నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఈనేపధ్యంలో  ముందుగా  జిల్లాలో ప్రజాప్రతినిధులతో మరుగుదొడ్లు నిర్మింపజేసి , తద్వారా ప్రజలుతో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే చాలా మంది ప్రజాప్రతినిధులకు మరుగుదొడ్లు లేవని తేలడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top