రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు


విజయనగరం టౌన్‌: రోడ్డు భద్రతా కమిటీతో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను  వి«విధ శాఖాధికారులతో  జిల్లా పోలీసు కార్యాలయంలో  సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.  జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ యూసీజీ నాగేశ్వరరావు,  ఎస్పీ ఎల్‌కెవి.రంగారావులు నిర్వహించిన సమీక్షలో  ఎస్పీ మాట్లాడుతూ  జిల్లా వాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో  కారణాలను అధికారులకు విశ్లేషించారు.



 ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను విస్తరించాలని, ఆక్రమణలు తొలగించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.  అధిక లోడ్‌లతో  వెళ్లే వాహనాలను సీజ్‌ చేయాలని, ప్రత్యేక దాడులను పోలీసులు, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులతో సంయుక్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులపై ట్రక్‌ బేలను మరింతగా విస్తరించాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న  ప్రాంతాల్లో మున్సిపల్‌ శాఖాధికారులు రాత్రి సమయాల్లో ఎక్కువ కాంతి ఉండే విధంగా లైట్లను ఏర్పాటు చేయాలన్నారు.  



జాతీయ రహదారులపై ట్రామా కేర్‌ సెంటర్‌లు మరింతగా ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో  రేడియం, రిఫ్లక్టివ్‌ టేప్‌లను , హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించాలని జాతీయ రహదారులకు కనీసం 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌ అధికారులకు ఎస్పీ సూచించారు.  జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టేప్పుడు భవిష్యత్తును  దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు మరింత సమర్ధవంతంగా రూపొందించాలని జాతీయ రహదారుల ఇంజినీరింగ్‌  అధికారులను ఆదేశించారు.



 సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనరు కృష్ణవేణి, అదనపు ఎస్పీ ఎవి.రమణ, ఆర్టీసీ రీజనల్‌ మేనేజరు అప్పారావు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారులు, విజయనగరం డీఎస్పీ ఎవి.రమణ, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.రాజేశ్వరరావు, రోడ్డు భద్రతా నోడల్‌ అధికారి  త్రినాథరావు, మున్సిపల్‌ కమిషనరు నాగరాజు, జాతీయ రహదారుల ఇంజినీరింగ్‌ అధికారులు, జాతీయ రహదారుల నిర్మాణ కాంట్రాక్టర్లు, పోలీస్, ఆర్టీసీ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top