టీడీపీ నోటీసుపై సభలో చర్చకు స్పీకర్ ఓకే


హైదరాబాద్: విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని అధికార పక్షం ప్రతిపాదించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై శాసనసభలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. సభాపతి స్థానాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బుధవారం శాసనసభలో అధికార పార్టీ సభ్యురాలు అనిత హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రస్తావించారు. ఆ అంశాన్ని చర్చకు చేపడుతామని స్పీకర్ ప్రకటించగా ఇప్పటికే ఒకసారి సస్పెండు చేసిన సభ్యులపై మరోసారి హక్కుల ఉల్లంఘన నోటీసు పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పోడియంను చుట్టుముట్టి నిరసన తెలియజేసింది.



బుధవారం ఉదయం రాజధాని అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టడంతో వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభం కాగానే...  వైఎస్సార్‌సీపీకి చెందిన తొమ్మిది మంది సభ్యులపై టీడీపీ సభ్యురాలు అనిత సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ప్రతిపాదించారు. ఈ నెల 19న సభలో స్పీకరును, సభాధ్యక్ష స్థానాన్ని కించపరిచేలా వ్యవహరించారని శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, పి.అనిల్‌కుమార్, కె.శ్రీధర్‌రెడ్డి, ఆర్.శివప్రసాద్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, ఆర్‌కే రోజాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో చర్చ, చర్యల కోసం ఈ అంశాన్ని సభ స్వీకరిస్తుందని స్పీకరు కోడెల శివప్రసాద్ ప్రకటించారు. దీనిపై విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆ రోజు... దళిత మహిళా స్పీకరు కుతూహలమ్మ నిండు సభలో కంటతడి పెట్టుకున్నారని జగన్ గుర్తు చేయగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో తమ నేతకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇది  కక్షసాధింపు చర్యని, అధికార పక్షం కుట్ర చేస్తోందంటూ నిరసన తెలిపారు.



చర్చకు పెట్టినప్పుడు మాట్లాడాలి: స్పీకర్



ఈ విషయాన్ని చర్చకు పెడతామని, అప్పుడు మాట్లాడాలంటూ స్పీకర్ సూచించారు. కేవలం రెండు నిమిషాలు మైక్ ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతించలేదు. చర్చలేనప్పుడు ఈ అంశంపై మాట్లాడేదేముందని ప్రశ్నించారు. ‘‘మీరు(వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు) ఇచ్చిన నోటీసులు, ఈ నోటీసు వేర్వేరు అంశాలు. మీరిచ్చిన నోటీసులను ప్రివిలైజ్ కమిటీకి పంపుతాం. కమిటీ ముందు మీ వాదన వినిపించండి. సభాపతిపైనా, సభాధ్యక్ష స్థానంపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వేరు. దీనిపై అనిత నోటీసు ఇచ్చారు. దీనిపై చర్చించి ఏమి చేయాలో నిర్ణయిస్తాం. అప్పుడు మీరు చెప్పేది చెప్పండి’’ అని స్పీకర్ సూచించారు.  అధికార సభ్యులు మాట్లాడుతూ.. విపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా జగన్‌కు అవకాశమివ్వగా.. ‘ఈ అంశంపై ఇప్పటికే మా పక్షానికి చెందిన ఎనిమిది మంది సభ్యులను మూడు రోజులు సస్పెండ్ చేశారు..’ అని చెప్పబోతుండగా మరో సారీ మైక్ కట్ చేశారు. చివరకు స్పీకరు సూచన మేరకు ప్రతిపక్షం నిరసన విరమించి సంక్షేమ పద్దులపై చర్చలో పాల్గొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top