కక్షలు మానండి.. కలం పట్టండి

కక్షలు మానండి.. కలం పట్టండి - Sakshi


- దత్తత గ్రామం కప్పట్రాళ్లను సందర్శించిన ఎస్పీ ఆకే రవికృష్ణ

- ‘మార్పు కోసం’ పేరుతో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సు

- రెండు నెలల్లో గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల ఏర్పాటుకు కృషి




కర్నూలు : కక్షలు మాని కలం పట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కప్పట్రాళ్ల ప్రజలు, విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఎస్పీ శుక్రవారం కప్పట్రాళ్లను సందర్శించారు. గ్రామంలో పర్యటించి ప్రజలు, విద్యార్థులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు దశాబ్దాలుగా గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల వల్ల వైరి వర్గాల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్షన్ గొడవల్లో మృతి చెందిన కుటుంబాలకు, జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తుల కుటుంబాల పిల్లల చదువుల పట్ల సహాయ, సహకారాలు అందిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన సరస్వతీ పూజకు హాజరై విద్యార్థులకు, గ్రామ ప్రజలకు డయల్ 100 గురించి అవగాహన కల్పించారు. డయల్ 100 పేరుతో ముద్రించిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. గ్రామంలో ఏవైనా సమస్య ఉంటే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. మార్పు కోసం పేరుతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును స్వయంగా ఓపెన్ చేసి అందులో ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి మహిళలు యువతీ యువకులు, విద్యార్థులు, వృద్ధులతో వేరు వేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.





కక్షలు వీడి గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉంటూ స్మార్ట్ గ్రామంగా కప్పట్రాళ్లను తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది మహిళలు మరుగుదొడ్ల విషయం, విద్యార్థులు పాఠశాల గదుల విషయం ఎస్పీ దృష్టికి తీసుకురాగా కప్పట్రాళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించడానికి తనవంతు కృషి చేస్తానని, అలాగే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని మే నెలలోపు ఏర్పాటు చేసుకునేలా పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఫ్యాక్షన్ ప్రభావం వల్ల హైస్కూల్‌కు భవనం లేని గ్రామంగా కప్పట్రాళ్లను గుర్తించామని పై అధికారులతో చర్చించి భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు విడుదల చేసినప్పటికీ ఫ్యాక్షన్ కక్షల వల్ల ఆ నిధులు గ్రామానికి చేరువ కాలేదని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకురాగా హైస్కూల్ భవన నిర్మాణానికి తిరిగి నిధులు రాబట్టేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.



‘ మార్పు కోసం’ పేరుతో కప్పట్రాళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును స్వయంగా పరిశీలిస్తున్న ఎస్పీ




ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్పా కక్షలు పెంచుకుని నష్టపోకూడదని మహిళలకు సూచించారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామంలో సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. డోన్ డీఎస్పీ పీఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు, కప్పట్రాళ్ల గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్‌ఐ మోహన్ కిశోర్, పోలీస్ సిబ్బంది ఎస్పీ వెంట గ్రామంలో పర్యటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top