‘నైరుతి’ ఆలస్యం..!


భూమధ్య రేఖ దాటాక  బలహీనపడ్డ రుతుపవనాలు

జూన్ 1కి కేరళకు.. విస్తరణలోనూ జాప్యం


 

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  గతంతో పోలిస్తే.. ఈసారి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే అండమాన్‌లో ప్రవేశించడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 30 నాటికల్లా కేరళను తాకవచ్చని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భూమధ్య రేఖను దాటాక రుతుపవనాలు బలహీనపడటంతో ప్రస్తుతం నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి మూడు రోజులైనా పట్టవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీకల్లా తాకే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

వడదెబ్బతో రాష్ట్రంలో 90 మంది మృతి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. రామగుండంలో శుక్రవారం 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న మోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 45, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలలో 44, మహబూబ్‌నగర్‌లో 43.6, రంగారెడ్డిలో 43.1, హైదరాబాద్‌లో 43, మెదక్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  కాగా, గత 24 గంటల్లో  నాగర్‌కర్నూల్‌లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 90 మంది మృత్యువాత పడ్డారు.

 

ఏపీలో 166 మంది..

ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వడగాడ్పుల జోరు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో 166 మంది మృత్యువాత పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top