దక్షిణ కాశ్మీరం...

దక్షిణ కాశ్మీరం... - Sakshi


అడవి తల్లి సిగలో విరిసిన పువ్వు.... అందాల ఆదిలాబాద్ జిల్లా అడవుల సోయగం

 పచ్చదనం పరుచుకుంది.. గిరిజనుల స్వచ్ఛతాగుణం మెచ్చుకుంది..!

 ఆధ్యాత్మికత అనువణువునా నింపుకున్న ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా గోపురం

 ఆలయాల ఖిల్లా ఇది.. అడవి తల్లీ దైవమే.. అనువుణువునా భక్తిభావమే..!!

 బ్రహ్మ చెక్కిన అందాలే దిగదుడుపు.. నిర్మల్ కొయ్య బొమ్మల అందాల ముందు..

 చారిత్రక కట్టడాలు.. గతమెంతో ఘనవైభవం అనుభవించిన చరిత్ర సాక్ష్యాలు..!!!

 నాలుగు లైన్ల జాతీయ రహదారి.. ఒంపుసొంపుల కెరమెరి ఘాట్ రోడ్ల అందం..

 ఎత్తై కుంటాల జలపాతం.. భీమ్ పురిటి గడ్డ జోడేఘాట్ పరిసరాల తన్మయత్వం.

 ఇలా..  చెప్పుకుంటూ పోతే... జిల్లాలో అనువణువునా అద్భుతాలే.

 ప్రకృతి రమణీయ అందాల ఆదిలాబాద్ జిల్లా ఉత్తర భారతదేశవాసులు దక్షిణానికి వచ్చేటప్పుడు ముఖద్వారంలా స్వాగతం పలుకుతోంది. దేశానికి ఉత్తర పైభాగంలో అందం కాశ్మీర్ అయితే.. దక్షిణాన తెలంగాణకు పైభాగంలో ఆదిలాబాద్ జిల్లాయే. ఈ జిల్లాను దక్షిణ కాశ్మీరం అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పేర్కొనడం గమనార్హం. టూరిజం సర్క్యూట్ టూర్  ఏర్పాటుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అందాలపై ప్రత్యేక కథనం.    
      

 - ఆదిలాబాద్

 

ఒంపు సొంపుల కెరమెరి ఘాట్



సిర్పూర్ (యు)లోని మిట్టే జలపాతం ఒకే చోట ఏడు జలపాతాలు కలిగి ఉండడం విశేషం. కెరమెరిలో శంకర్‌లొద్ది గుహ ప్రసిద్ధి గాంచింది. శిథిలమైన ఈ గుహలో నుంచి వెలితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మరో పక్క నిర్మల్ గుహలు, ఇంకో పక్క వరంగల్ కాకతీయ గుహలు తారసపడతాయని అక్కడి వారు చెప్పుకుంటారు. నార్నూర్‌లోని కుండాయి జలపాతం, కెరమెరిలోని బోదర, సిర్పూర్ (యు)లోని సప్తగుండాల వాటర్‌ఫాల్, నేరడిగొండలోని గాయత్రీ జలపాతం, కెరమెరి ఘాట్ రోడ్ల అందాలు చూసేందుకు ప్రజలు చెట్టుపుట్టలను దాటుకుని వెళ్లి ఆహ్లాదం పొందుతారు. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి.

 

శివ్వారం అభయారణ్యం



వేమనపల్లి మండలంలోని శివ్వారం అభయారణ్యానికి ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. ఇక్కడ మొదటిసారి డైనోసర్ అస్థికలు(ఫాజిల్స్) లభించాయి. ప్రస్తుతం ఇవి హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శనకు ఉంచారు. దట్టమైన అడవి ఉండడంతో పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

 

ఆలయాలకు జిల్లా నిలయం

 

జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రత్యేకతను కలిగి ఉంది. కార్తీక మాసంలో సూర్య భగవానుడే సూటిగా దిగి వచ్చి తన కిరణాలతో స్వామి చరణములను తాకుతాడు. భక్తులు ప్రతీ ఏడాది ఈ సమయం కోసం ఎదురు చూస్తుంటారు. 11, 12వ శతాబ్దంలో నిర్మించారని చెప్పుకుంటారు. పల్లవులు, చోళుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. జైనులు హస్తగతం చేసుకున్న అనంతరం జైనథ్ అనే పేరు వచ్చింది. కొంతకాలం కాకతీయులు కూడా పాలించారు. పూర్తిగా నల్లరాయితో నిర్మించారు. ఇక్కడ 35 ఎకరాల పరిధిలో కోనేరు ఉంది. దండేపల్లి మండలం గూడెంలో సత్యనారాయణస్వామి ఆలయం, దిలావర్‌పూర్‌లో కదిలే పాపహరేశ్వరాలయం, ఇంద్రవెల్లిలో నాగోబా ఆలయం, బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయం, సారంగాపూర్‌లోని అడెల్లి పోచమ్మ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి.

 

కవ్వాల్ అభయారణ్యం... దట్టమైన వనం




దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ కోసం ఉద్యమం నడుస్తుండగా జిల్లా కూడా పులల సంరక్షణకు కేంద్రంగా ఉండడంతో దేశాన్ని ఆకర్షిస్తుంది. జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం 2012లో టైగర్ జోన్(పులల సంరక్షణ ప్రదేశం)గా గుర్తించారు. 894 చదరపు కిలోమీటర్ల పరిధిలో టైగర్‌జోన్ విస్తరించి ఉంది. దేశంలో 42వది ఈ కవ్వాల్ టైగర్‌జోన్. తెలంగాణ రాష్ట్రంలో టైగర్‌జోన్ ఇది ఒక్కటే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలో టైగర్‌జోన్ ఉంది. కాగా మహారాష్ట్రలోని తాడ్వాయి టైగర్‌జోన్ నుంచి మన టైగర్‌జోన్‌కు పులులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ జోన్ పరిధిలో 12 రిసార్ట్‌లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అభయారణ్యంలో జింకలు, దుప్పులు, నీల్‌గాయి, చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవిదున్నలు, సాంబారులు, రేసుకుక్కలు, నెమళ్లు, ముళ్లపందులు, అడవిపందులు, అడవిపిల్లులు, అడవి కోళ్లు తదితరాలు ఉన్నాయి. అంతేకాదు రకరకాల పక్షులున్నాయి. దుంగపల్లి, కలపకుంటలో ఎత్తై వాచ్‌టవర్లను నిర్మించారు. వీటి పైనుంచి అడవి అందాలు తిలకించవచ్చు.

 

దేశంలో రెండో సరస్వతీ క్షేత్రం.. బాసరలో



దేశంలో రెండే రెండు సరస్వతీ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీర్‌లో ఉండగా.. రెండవది మన జిల్లాలోని బాసరలోనే ఉంది. పౌరాణిక ఆధారాలను అనుసరించి.. వ్యాసమహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు గోదావరి నది ఒడ్డున ఉన్న స్థలాన్ని తన తపస్సుకు అనువైనదిగా ఎంచుకున్నారు. ప్రతీరోజు మూడు పిడికిళ్ల ఇసుకను గోదావరి నుంచి తీసుకువచ్చి లక్ష్మి, పార్వతి, సరస్వతీ మూర్తుల విగ్రహాలను రూపొందించార ు. అక్కడే ఉంటూ నిత్యం పూజలు చేసేవారు. అలా అది ఆధ్యాత్మిక స్థలంగా మారింది. కాలక్రమేణా ధ్వంసమైన ఈ దేవాలయాన్ని తిరిగి ఓ భక్తుడు పునరుద్ధరించారని చె ప్తుంటారు. అనంతర కాలంలో జగద్గురు, శృంగేరి శారదా పీఠాధిపతులు విద్యారణ్యస్వామి ఆలయ పునరుద్ధరణ చేసి సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం బాసరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వచ్చే సంవత్సరం జరగనున్న పుష్కరాలు స్థానిక గోదావరి ఒడ్డున సందడి చేయనున్నాయి.

 

జాతీయ రహదారి అందాలు



దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి నం.44. ఈ రహదారి జిల్లా గుండానే వెళ్తుంది. ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల మీదుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్తుంది. నాలుగు లైన్ల ఈ రహదారి అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాలమైన రోడ్లు ప్రయాణ సౌలభ్యాన్ని పెంచాయి. వంపులు తిరిగిన చోట్ల ఆ అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.

 

రాష్ట్రంలోనే ఎత్తై జలపాతం కుంటాల



రాష్ట్రంలోనే ఎత్తై జలపాతం కుంటాల కావడం గమనార్హం. ఈ జలపాతం కడెం నదీ ప్రవాహంలో ఉంది. నేరడిగొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో కొండలు, కోనలు దాటి, రాళ్లురప్పలను తాకుతూ కుంటాల ప్రాంతంలో 46 మీటర్ల పై నుంచి నీళ్లు జాలువారుతు చేసే శబ్ధం తన్మయానికి గురి చేస్తుంది. ఈ నది బోథ్ తాలుకాలోని భూతాయి ప్రాంతంలో ప్రారంభమై దారిలో చిన్న వాగులువంకలను తనలో కలుపుకుంటూ కడెం జలశయానికి చేరుకుంటుంది. చివరకు గోదావరిలో కలుస్తుంది. ఈ జలపాతం ప్రాంతంలో గుహలో సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు. గతంలో నిజాం నవాబులు ఈ ప్రాంతంలో వేట కోసం వచ్చి విడిది చేసేవారని చెప్పుకుంటారు. బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం సెలయేటి గలగలతో సందడి చేస్తుంది. కడెం జలపాతం వద్ద పర్యాటకంగా కొంత అభివృద్ధి జరిగింది. బోటింగ్, రిసార్ట్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

 

నిర్మల్ కోటలు.. కొయ్యబొమ్మలు

 

నిర్మల్ పట్టణ, పరిసర ప్రాంతంలో నిమ్మనాయుడి పాలన కాలంనాటి శ్యాంఘడ్, బత్తీస్‌ఘడ్, నిర్మల్‌కోట, గొలుసుల దర్వాజ, సోన్‌లోని చారిత్రాత్మక వెంకటేశ్వర దక్షిణముఖ హనుమాన్ ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కోటలను పర్యాటకశాఖ పరంగా అభివృద్ధి చేస్తుండడంతో పురాతన కట్టడాలు భవిష్యత్తరాలకు కూడా కనిపించేలా నిలువనున్నాయి. నిర్మల్ కొయ్య బొమ్మలు జిల్లాకు వన్నెతెస్తున్నాయి. 1955లో కొయ్య బొమ్మల సహకార సంస్థను పాలకొండ గుండాజి, భూసాని నర్సింలు, దన్నూరి పోశెట్టివర్మ ఏర్పాటు చేశారు. నిర్మల్ కొయ్యబొమ్మల సంస్థకు రాష్ట్రపతి అవార్డు పొందింది.

 

భీమ్ జన్మస్థలం.. జోడేఘాట్



జల్ జంగల్ జమీన్ కోసం నైజాంను ఎదురొడ్డి వీరమరణం పొందిన గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ జన్మస్థలం జోడేఘాట్‌ను ఆయన పేరు మీద అభివృద్ధి చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురం భీమ్ వర్ధంతి సభలో ప్రకటించారు. రూ.25 కోట్లు ఇందుకోసం కేటాయించారు. 200 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భీమ్ వర్ధంతి రోజు గిరిజనులు ప్రదర్శించే కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. గుస్సాడీ నృత్యాలతో సందడి చేస్తారు.

 

అయినా అడవి కాచిన వెన్నెలలా..




జిల్లాలో ప్రకృతి అందాలు ఎన్నో కనివిందు చేస్తున్నాయి. సహజసిద్ధ అందాలు ఓవైపు.. మానవ నిర్మిత అద్భుతాలు మరోవైపు అలరిస్తున్నాయి. పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే విశిష్టలతలు జిల్లాలో చాలా ఉన్నాయి. పర్యాటకరంగం కొన్ని దేశాల్లో అమితంగా ఆదాయాన్నిచ్చే వనరు. మన దగ్గరికి వచ్చే సరికి వనరులు ఉన్నా వాటిని ఆదాయ మార్గంగా మలచుకోవడంలో మన పర్యాటక శాఖ విఫలమైందనే చెప్పవచ్చు. అభివృద్ధి జరుగక పర్యాటక అందాలన్నీ అడవికాచిన వెన్నెల్లా మిగిలిపోతున్నాయి. నాలుగు నెలల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం మన ఊరు మన ప్రణాళికలో అనేక టూరిజం పనులను గుర్తించారు. ఐదేళ్లలో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని యోచించడం శుభపరిణామం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top