త్వరలో ఇసుక నూతన పాలసీ


జిల్లాకు 11లక్షల క్యూబిక్‌మీటర్లు అవసరం

 మీసేవలో బుక్ చేసిన వారానికే డెలివరీ

 గృహావసరాలకు కొరత రానీయం

 విశాఖకు పొరుగు జిల్లాల రీచ్‌ల నుంచి

 మంత్రి గంటా శ్రీనివాసరావు


 

విశాఖపట్నం: ఇసుక కొరత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని త్వరలో ప్రకటించనుందని, ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించి కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్టు రాష్ర్ట మానవనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాకు కేటాయించిన ఇసుకను సిఫారసులతో బడాబాబులు తరలించుకుపోతున్న వైనంపై ‘పెద్దలకు మాత్రమే’ శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనంపై మంత్రి గంటా తీవ్రంగా స్పం దించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో కలిసి కలెక్టరేట్‌లో మంత్రి మాట్లాడుతూ పొరుగున ఉన్న శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జిల్లాలోని అవసరాల కోసం 9 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను రప్పించేందుకు ఏర్పాట్లు  చేశామని తెలిపారు.  క్రెడాయ్ తదితర బిల్డర్స్ అసోసియేషన్లకు వారి అవసరాలకు తగ్గట్టుగా ఇసుకను కేటాయించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు.



గతంలో మాదిరిగా ఎక్కడపడితే అక్కడ కొనుక్కునే అవకాశం లేదని..ఏ జిల్లా పరిధిలో ఇసుకను ఆ జిల్లా పరిధిలోనే వినియోగించాలన్నారు. అందు వల్ల అవసరమైన ఇసుకను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని క లెక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. జిల్లాలో ఇసుక కొరతను అధిగమిం చేందుకు శ్రీకాకుళం జిల్లాలోని పద్మాపురం (పలాస డిపో) నుంచి 5775 క్యూబిక్ మీటర్లు, వీరఘట్టం మండలం కంబార రీచ్ నుంచి 40వేలు క్యూబిక్ మీటర్లు, కొత్తూరు మండలం మాతాలలో రైతుల పొలాల్లోని డికాస్టింగ్ శాండ్ 8,30 లక్షల క్యూబిక్ మీటర్లుతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం బోట్స్‌మన్ సొసైటీ నుంచి 30వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను సరఫరాకు ఏర్పాట్లు చేశారన్నారు. నాలుగు రోజులుగా ఆరిలోవ డిపో ద్వారా 10వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను పెండింగ్ ఆర్డర్లకు సరఫరా చేశామని చెప్పారు. మిగిలిన ఇసుకను  వ్యక్తిగత అవసరాల కోసం, పరిశ్రమలు, బిల్డర్స్ అసోసియేషన్, ఏపీఐఐసీ,  ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు కేటాయిస్తామన్నారు. ఇసుక కొరతను అధిగమించేందుకు పొరుగు జిల్లాల నుంచి 24 గంటలూ ఇసుకను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ విశాఖ నగరంలో ఆరిలోవ, ఆనందపురం ప్రాంతాల్లో ఇసుక డిపోలున్నా యని, త్వరలో అనకాపల్లిలో కూడా మరో డిపోను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది నిర్మాణ రంగంలో కార్యకలాపాలు భారీగా పెరిగాయన్నారు. గతేడాది 9లక్షల క్యూబిక్‌మీటర్‌ఇసుక సరిపోగా, ఈ ఏడాది 11లక్షల క్యూబిక్‌మీటర్‌ఇసుక అవసరం ఏర్పడిందన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top