డీఆర్‌డీఎల్‌కు త్వరలో భూసేకరణ


కర్నూలు(అగ్రికల్చర్): రక్షణ శాఖ జిల్లాలో నెలకొల్పే డిఫెన్స్ రీసెర్స్ డెవలప్‌మెంట్ ల్యాబ్(డీఆర్‌డీఎల్)కు అవసరమైన భూములను త్వరలో సేకరించనున్నట్లు కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. డీఆర్‌డీఎల్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం గుర్తించిన భూములను పరిశీలించేందుకు గురువారం డిఫెన్స్, రీసెర్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) నుంచి ఎనిమిది మంది ఉన్నత స్థాయి అధికారులు జిల్లాకు వచ్చారు.  



వారు ఓర్వకల్లు మండలంలోని కాల్వ, పాలకొలను, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, కొంతలపాడు గ్రామాల్లో గుర్తించిన భూములను పరిశీలించారు. తర్వాత కలెక్టర్ విజయ్‌మోహన్, జేసీ కన్నబాబులతో సమీక్షించారు. అనంతరం డీఆర్‌డీఓ బోర్డు ఛైర్మన్ సభ్యులు పవర్‌పాయింట్ ద్వారా తాము చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ పేరుతో శతష్నులు, క్షిపణిలు, ఇతరత్ర యుద్ధ సామాగ్రి తదితర వాటిని ఉత్పత్తి చేయడంతో పాటు పలు పరిశోధనలు ఉంటాయన్నారు. దీనిని నెలకొల్పడానికి కనీసం 3 వేల ఎకరాల భూములు కావాలని వివరించారు.



ప్రైవేటు భూములు ఉంటే ఎప్పటిలోగా సేకరిస్తారు. అసైన్డ్ భూములను ఏ విధంగా తీసుకుంటారు. అప్రోచ్ రోడ్డు ఎప్పుడు వేస్తారు.. తదితర వాటిని కలెక్టర్, జేసీల ముందు ఉంచారు. కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటి వరకు 2500 ఎకరాల భూములు గుర్తించామని, మిగిలిన 500 ఎకరాలు వెంటనే గుర్తిస్తామని, ఇందులో 150 ఎకరాలు ప్రైవేటువి, 163 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు.



జిల్లాలో నెలకొల్పే సంస్థ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, దీనిని దశల వారీగా దాదాపు రూ.16 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా తెలిపారని కలెక్టర్  తెలిపారు. సివిల్ పనుల కోసం ఈ ఏడాది రూ.476 కోట్లు వరకు ఖర్చు వేయనున్నారని చెప్పారు. కర్నూలు-ఓర్వకల్లు మధ్య క్యాటర్ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూములు కావాలని అడిగారని , వీటిని కూడా సమకూరుస్తున్నామని వివరించారు.  కేంద్రం నుంచి వచ్చిన బృందంలో రామకృష్ణ, అండార్‌సత్తార్, అమర్‌గుప్త, నారాయణ తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top