త్వరలో ఏపీతో రైల్వేస్ జాయింట్ వెంచర్

త్వరలో ఏపీతో రైల్వేస్ జాయింట్ వెంచర్


- రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడి

- నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం

- రైల్వే జోన్ వస్తుందన్ననమ్మకం ఉంది: చంద్రబాబు


 

 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జాయింట్ వెంచర్‌కు రైల్వే శాఖ త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటుందని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. ఈ ఒప్పం దంతో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. సీఎం చంద్రబాబు, మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలసి సురేశ్ ప్రభు మంగళవారం విజయవాడలో నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గంతో పాటు నంద్యాల-కడప డెమూ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రభు మాట్లాడుతూ.. రూ. వెయ్యి కోట్లతో చేపట్టిన ఈ రైలు మార్గం ద్వారా రాయల సీమను రాజధాని అమరావతికి అనుసంధానం చేశామన్నారు. త్వరలో ఈ మార్గం గుండా ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతామన్నారు. ఒలింపిక్ పతకం సాధించిన సింధు తండ్రి రైల్వే ఎంప్లాయి కాబట్టి ఆమెది తమ కుటుంబమేనని సురేశ్ ప్రభు అన్నారు.



 రాయ్‌పూర్-విశాఖ కారిడార్ ప్రకటించాలి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రైల్వే జోన్ వస్తుందన్న నమ్మకం తనకుందని సీఎం చంద్రబాబు అన్నారు. చెన్నై-ఢిల్లీ వయా విజయవాడ, విజయవాడ-ఖరగ్‌పూర్ వయా విశాఖ, ముంబై-ఖరగ్‌పూర్ వయా నాగ్‌పూర్ కారిడార్లను కేంద్రం ప్రకటించిందని, అలాగే రాయ్‌పూర్-విశాఖ కారిడార్‌ను ప్రకటించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశానన్నారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే నిధులు సమీకరించి కొత్త లైన్లు, రైల్వే స్టేషన్ల సుందరీకరణ చేపట్టేందుకు వీలుంటుందన్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇంతకాలం ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. 1996లో నంద్యాల-ఎర్రగుంట్ల రైలుమార్గానికి తానే భూమి కేటాయించానన్నారు. ఈ మార్గం రాయలసీమకు కీలకమైనదని, సిమెంట్ ఫ్యాక్టరీలకు, సీపోర్టులకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాల్లో రైళ్లలో 41 లక్షల మంది ప్రయాణికులు ఇరువైపులా ప్రయాణించారన్నారు.



 పీవీ కల నెరవేరింది: కేంద్ర మంత్రి వెంకయ్య

 గతంలో రైల్వే మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 40 ఏళ్లు పడుతుందని, కొత్త రైళ్లు, హామీలు ఇవ్వవద్దని ప్రధాని మోదీ రైల్వే మంత్రికి సూచించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నంద్యాల -ఎర్రగుంట్ల రైలుమార్గం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కల అని, ఆ కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి.పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ఎంపీలు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, పలువురు ఎమ్మెల్యేలు, దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు.



 నంద్యాల-కడప డెమూ రైలు ప్రారంభం

 నంద్యాల: కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించిన అనంతరం నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ ఎస్పీవెరైడ్డి, ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, భూమా నాగిరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, పలువురు అధికారులు పచ్చజెండాలు ఊపడంతో నంద్యాల-కడప డెమూ రైలు కడపకు బయలుదేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top