కొడుకును ప్రధానిని చేయడానికే రాష్ట్రాన్ని విభజించిన సోనియా: జగన్

కొడుకును ప్రధానిని చేయడానికే  రాష్ట్రాన్ని విభజించిన సోనియా: జగన్ - Sakshi


హైదరాబాద్:  తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. ఆయన ఈరోజు జాతీయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు బాగోలేదన్నారు.  ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం సరికాదన్నారు.  ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్రం కావాలని కోరుకుంటే అసెంబ్లీని సమావేశపరచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే ముందుగా ఎందుకు రాజీనామా చేయలేదని అడిగారు. ఒకవేళ సీఎం రాజీనామా చేసి ఉంటే దేశమంతా ఆలోచించేదన్నారు. తద్వారా విభజన ప్రక్రియ జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.



రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసమే తాను దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ తీర్మానాన్ని విస్మరించి నా మార్గంలో నేను పోతానంటే ఎలా? హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మంటే ఎక్కడకు వెళతారు? అని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ముందు లేఖ ఇచ్చి ఆ తర్వాత ఆయనకు నచ్చింది చేయమనమని చెప్పారు.  

సమైక్య లేఖ ద్వారా నా నిజాయితీ ఇదీ, అని చంద్రబాబును ఓ సందేశం ఇవ్వమనండన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వడం లేదో ఆయనను మీడియానే అడగాలన్నారు. విభజనకు వ్యతిరేకంగా అందరూ లేఖ ఇవ్వాలని కోరారు. వ్యవస్థ మారాలన్నదే తమ తాపత్రయం అన్నారు.  కాంగ్రెస్, బిజెపి, ఎన్సీపి నుంచి సిపిఐ వరకు అందరూ అడ్డగోలు విభజన పట్ల  తమ తీరు మార్చుకోవాలని కోరారు.



అసెంబ్లీ తీర్మానం జరిగితే అడ్డగోలు విభజనను అడ్డుకోవాలని అన్ని రాజకీయపార్టీలను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో విభజన జరిగినట్లు దేశంలోని మరే ప్రాంతంలోనూ జరగదని ఎలా చెప్పగలం? అని ప్రశ్నించారు. ఇప్పుడు గొంతు కలపకపోతే ఇంతటితో ఆగిపోదని హెచ్చరించారు. ఈ అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశిస్తున్నాను, దీని కోసమే పోరాడుతున్నానని చెప్పారు.



రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ తీరుకూడా సరిగాలేదని జగన్ చెప్పారు. కేవలం 17 లోక్‌సభ సీట్ల కోసం ఇలా చేయడం సరికాదన్నారు. బోడోలాండ్‌, గూర్ఖాలాండ్‌, విదర్భ విషయంలో ఎందుకు ఇలా చేయలేకపోయారు? అని ఆయన ప్రశ్నించారు.  అధికారముందికదా అని   కేంద్రం  నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజిస్తోందని బాధపడ్డారు. కేంద్ర నిరంకుశ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. అన్ని అంశాలను తమ లాయర్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  6 వారాల్లో మంత్రుల బృందం సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుంది? అని అడిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top