పోటాపోటీ టీడీపీ అర్బన్ అధ్యక్ష పీఠం ఎవరికో?

పోటాపోటీ  టీడీపీ అర్బన్ అధ్యక్ష పీఠం ఎవరికో? - Sakshi


కాట్రగడ్డ బాబుకు గద్దె సిఫార్సు

కోగంటి వైపు మంత్రి ఉమా, ఎమ్మెల్సీ బుద్దా మొగ్గు

గన్నే ప్రసాద్‌కు అనుకూలంగా ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా

ఎస్సీ, బీసీలకు మొండి చేయే!

 


విజయవాడ : టీడీపీలో సీటు ఫైటు జోరుగా సాగుతోంది. విజయవాడ అర్బన్ అధ్యక్ష పీఠాన్ని తమకు అనుకూలమైనవారికి ఇప్పించేందుకు ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి రావడంతో అర్బన్ అధ్యక్ష పదవి చాన్స్ మరొకరికి ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజధాని ప్రాంతం కావడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండటంతో అర్బన్ అధ్యక్ష పీఠానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పలువురు ఈ పదవిపై కన్నేశారు. అర్బన్ అధ్యక్షుడిగా తమకు  అనుకూలమైన వారిని నియమించుకోవాలని అధికార పార్టీకి చెందిన   ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.



అధ్యక్ష పీఠం కోసం పలువురి పోటీ...

పార్టీలో సీనియర్ నేత, అర్బన్ మాజీ ఉపాధ్యక్షుడు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు (బాబు) పీఠం రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారు. గతంలో పశ్చిమ నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినందున ఈసారి తూర్పు నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉండే కాట్రగడ్డ బాబుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. బాబును అధ్యక్షుడిగా నియమించేందుకు గద్దె ఒక కేంద్ర మంత్రి ద్వారా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లాతో పాటు అర్బన్‌పైనా తన పట్టు కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. ఆయన టీడీపీలో సీనియర్ నేత, అర్బన్ ప్రచార కార్యదర్శి కోగంటి రామారావు పేరు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఒకవేళ తప్పనిసరై తనను మార్చే నిర్ణయం తీసుకుంటే ఆయనకే మద్దతిచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరోపక్క ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తనకు సన్నిహితంగా ఉండే కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నే నారాయణ వరప్రసాద్ (అన్నా)లకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బొండా కూడా ఉమా గన్నే ప్రసాద్‌కు మద్దతిస్తున్నట్లు తెలిసింది.



ఎస్సీ, బీసీల మాటేమిటి!

ప్రస్తుతం అర్బన్ అధ్యక్ష రేసులో ఉన్న నేతలంతా చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి చెందినవారే. వారి మధ్యే సం‘కుల’ సమరం జరుగుతోంది. మరోవైపు అధికారంలో లేనప్పుడు పార్టీ జెండాను మోసిన ఎస్సీ, బీసీ నేతలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు తమను వాడుకుని ఇప్పుడు కరివేపాకులా తీసిపారేస్తున్నారని, కేవలం ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీలు వంటి పనికిరాని పదవులకే పరిమితం చేస్తున్నారని ఆయా వర్గాల నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బీసీ వర్గంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరా, మాజీ ఉపాధ్యక్షుడు లుక్కా సాయిరాం గౌడ్, ఎస్సీల్లో సీనియర్ నేతలు సొంగా రవీంద్రవర్మ, అర్బన్ ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం.



జిల్లా అధ్యక్ష పదవి పైనా...

ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అదే జరిగితే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.వీరబాబును అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టి పార్టీపై తన పట్టు మరింత బిగించేందుకు మంత్రి ఉమా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top