అమరులకు ఘన నివాళి

అమరులకు ఘన నివాళి - Sakshi


గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీస్ అమరులకు ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

 గుంటూరు క్రైం: సమాజంలో పోలీస్ ఉద్యోగం పవిత్రమైందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు సిబ్బంది నుంచి తొలుత గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు నివాళులర్పించారు.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పోలీసులు ప్రజల సంక్షేమం కోసం చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా వుంటుందని స్పష్టం చేశారు. సిబ్బందిలో స్ఫూర్తి నింపేందుకు అమరవీరుల దినోత్సవం దోహదపడుతుందని తెలిపారు. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసులకు తప్పనిసరిగా వారాంతపు సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.



కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ పోలీసుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. విధి నిర్వహణలో అంతర్గత శత్రువులను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ప్రత్యేక బలగాలు, అధునాతన ఆయుధాలు పోలీస్‌శాఖకు అవసర మని స్పష్టం చేశారు. రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన వారి స్ఫూర్తితో ఎలాంటి పరిస్థితులలోనేనా ప్రజలకు సేవలు అందించేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా వుంటుందన్నారు.



అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరజ్యోతి వద్ద మంత్రి పుల్లారావు, ఎమ్యెల్యేలు మెహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, కలెక్టర్ కాంతీలాల్‌దండే, జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌లు పుష్పగుచ్చాలు ఉంచి  ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్‌లు స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు తెలిపారు.



పోలీస్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా బహుమతులను అందించి అభినందించారు. అనంతరం రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, అదనపు ఎస్పీలు, పోలీస్ కుటుంబాల సభ్యులు అమరవీరుల స్థూపంవద్ద అమరజ్యోతిని వెలిగించి పూలమాలలు వుంచి నివాళులర్పించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసులు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top