సామాజిక విప్లవకారుడు పూలే

సామాజిక విప్లవకారుడు పూలే


బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు



ఏఎన్‌యూ: విశ్వమేధావి పూలే అని బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా పూలే వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పీడిత జాతుల విముక్తి ప్రదాత పూలే అని చెప్పారు.



ఆధునిక భారతదేశ చరిత్రలో కులవ్యవస్థను సమగ్రంగా విశ్లేషించి కులనిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. పూలే సిద్ధాంతాలపై ఏఎన్‌యూ అధ్యయన కేంద్రంలో సమగ్రంగా పరిశోధనలు చేయాలని సూచించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ పూలేపై ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలు, రచనలను ఏఎన్‌యూ పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో తెలుగులో ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.



కార్యక్రమానికి పూలే అధ్యయన కేంద్రం డెరైక్టర్ ఆచార్య నూర్‌బాషా అబ్దుల్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు, సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి.ప్రసాద్, భావనారుషి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



 సొషల్ సైన్స్ డీన్ తొలగింపు అన్యాయం

 యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్‌గా నియమితులైన చంద్రకుమార్‌ను రెండునెలల్లో తొలగిం చడం అన్యాయమని ఏఎన్‌యూ ఎస్పీఎస్‌ఎఫ్ (గిరిజన విద్యార్థి సమాఖ్య) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గిరిజనుడైన చంద్రకుమార్‌ను అకారణంగా పదోన్నతి తొలగించడం అప్రజాస్వామికమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఎస్టీఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాసనాయక్, డి.అంకన్న ఉన్నారు.



నేడు మిణుగురులు సినిమా ప్రదర్శన

యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం మిణుగురులు సినిమా ప్రదర్శన జరుగుతుందని ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు డైక్‌మెన్ ఆడిటోరియంలో సినిమా ప్రదర్శన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top