యువశక్తి.. సేవానురక్తి

యువశక్తి.. సేవానురక్తి


అమలాపురం టౌన్ :చినుకు, చినుకు కలిసి చెరువు అయి దాహం తీరుస్తాయి. మూన, మూన కలిసి పైరు అయి ఆకలి తీరుస్తాయి. అలాగే ఆ విద్యార్థులంతా కలిసి ఒక్కటై మంచి పనులకు శ్రీకారం చుడుతున్నారు.  ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటూనే.. ఇంకోవైపు సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రేపటి బాటలు వేసుకునే సమయంలో సాటి మనుషుల నేటి కష్టాలకు స్పందిస్తున్నారు. శక్తి మేరకు సహాయ హస్తం అందిస్తున్నారు. అలాంటి సేవాదళమే అల్లవరం మండలం ఓడలరేవులోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ‘సాల్ట్ ఆఫ్ సర్వీస్’!జిల్లాలోని 31 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 80 వేల మంది విద్యార్థుల్లో కనీసం 25 శాతం మంది సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్టు అంచనా.

 

 ఇటీవల పలు ప్రధాన ఆస్పత్రుల్లో రక్తదాతల జాబితాల్లో అధిక శాతం ఇంజనీరింగ్ విద్యార్థుల పేర్లే కనిపిస్తున్నాయి. హుద్‌హుద్ తుపానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర బాధితుల కోసం జిల్లావ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు రూ.50 లక్షల వరకూ విరాళాలుగా ఇచ్చారు. ఇంజనీరింగ్ పూర్తయిన కొందరుమిత్రులు   అమలాపురం కేంద్రంగా ‘యువ సైనిక్’ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి రక్తదానం, అన్నదానం, వస్త్రదానంతో పాటు పేదల వాడల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఓడలరేవులోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 2006 నుంచి ‘సాల్ట్ ఆఫ్ సర్వీస్’ పేరుతో ఏటా లక్షలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

 

 వంటకాల్లో ఉప్పు లేకుంటే ఎలా రుచి ఉండదో, సేవాభావం లేని జీవితానికి పరమార్థం లేదన్న భావనతోనే సంస్థకు ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 200 మంది విద్యార్థులు భాగస్వాములుగా ఉన్నారు. సంస్థ తరఫున 500 మంది విద్యార్థులు ఏ క్షణంలోనైనా రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కోనసీమలోని పలు గ్రామాల్లో పేద రోగులకు ఈ సేవా సంస్థ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తోంది. వృద్ధాశ్రమాల కు కావలసిన సామగ్రి, నిత్యావసర వస్తువులు సమకూరుస్తోంది. సంస్థకు సమన్వయకర్తగా కళాశాల అధ్యాపకుడు శ్రీపాద రామకృష్ణ వ్యవహరిస్తూ విద్యార్థులను సేవాపథంలో ముందుకు నడుపుతున్నారు.

 

 చదువు, సేవ రెండు కళ్లు

 మేమంతా చదువుకు అవసరమైన సమయాన్ని వెచ్చిస్తూనే సమాజంలో కొందరికైనా మా వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో సేవకూ ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే మా దృష్టిలో చదువు, సేవ రెండు కళ్లు. మా తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చే డబ్బుల్లోంచి కొంత తీసి, దానికి దాతల నుంచి సేకరించిన విరాళాలను జోడించి సాల్ట్ ఆఫ్ సర్వీస్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నాం. సేవల్లో భాగస్వాములం కావడం ఎంతో తృప్తినిస్తుంది.

 - మండలపు లావణ్య, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని

 

 ఈ స్ఫూర్తి జీవితాంతం కొనసాగిస్తాం..

 ఇంజనీరింగ్ విద్యార్థి దశలో సాల్ట్ ఆఫ్ సర్వీస్ ద్వారా చేస్తున్న సేవలను ఇప్పటికే పరిమితం చేయం. ఇదే స్ఫూర్తిని మా జీవితాంతం కొనసాగిస్తాం. సమాజంలోని అభాగ్యులకు, అన్నార్తులకు మా వంతు సేవలు చేస్తూనే ఇతరుల నుంచి కూడా విరాళాలు సేకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సహకరిస్తాం. ముఖ్యంగా పేద కుటుంబాల్లో విషమవ్యాధులకు గురైన వారి వైద్యం కోసం అధిక ప్రాధాన్యతనిస్తాం.

 - గూరుగుబెల్లి రాజేష్‌కుమార్, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top