జోహార్ శోభమ్మ

జోహార్  శోభమ్మ - Sakshi


జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.. ఘాట్ వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన ప్రతి హృదయం చలించింది. చేతులెత్తి

 మొక్కి.. జోహార్ శోభమ్మ అంటూ నినదించారు.

 

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: శోభా నాగిరెడ్డి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రకటించారు. ట్రస్టుకు ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించానని, అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తానని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో శోభా ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు.

 

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్నా సరైన ప్లాట్‌ఫాం లేక ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వీరందరికీ ట్రస్టు ద్వారా సహాయం చేస్తామన్నారు. అదేవిధంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రతి యేటా ఆమె జయంతి, వర్ధంతి రోజున కల్యాణమస్తు పేరిట పేదలకు పెళ్లిళ్లు చేస్తామన్నారు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాల సాధనకు కృషి చేస్తామని వర్ధంతి సభకు తరలివచ్చిన అశేష జనవాహినికి హామీనిచ్చారు.

 

 తామంతా ఇంత ధైర్యంతో ముందుకు పోతున్నామంటే అది మీ అభిమానమేనని ప్రకటించారు. ‘ఆమె లేని లోటు నిజంగా మా కుటుంబానికి తీరనిలోటు. కేవలం భార్యగానే కాకుండా నాకు మంచి స్నేహితురాలిగా ఉంది. ఇటువంటి రోజు నా జీవితంలో ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు. ఆమె లేని జీవితం నాకు చాలా బాధాకరమైనది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అది కేవలం పిల్లల కోసమే’ అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ‘మాది పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరి కష్టసుఖాలు ఆమె తెలుసుకునేది.

 

  ఈ రోజు అందరం కలిసి ఉన్నామంటే అది శోభ ఘనతే’ అన్నారు. ఎక్కడ ఉన్నా నెంబర్ 1గా ఉండాలన్నదే ఆమె అభిమతమని, ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ నెంబర్ 1గా ఉండేందుకు కృషి చేసేదన్నారు. ఆ నాయకుడు నెంబర్ 1గా ఉండాలని కోరుకునే మంచి స్వభావం ఆమెదని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఇంత దగ్గర అవుతామని అనుకోలేదన్నారు. విజయమ్మ వెంట ఉండి ఆమెకు మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. ‘జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేయాలని ఆమె భావించింది. ఆమె చివరిసారిగా మాట్లాడిన మాటలు కూడా అవే. బహుశా అది ఇప్పుడు కాదని భావించే ముందుగానే వెళ్లిపోయినట్టుంది’ అని బాధాతప్త హృదయంతో వ్యాఖ్యానించారు. ‘‘నంద్యాల బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లు.. సమయం అయిపోయింది అని అన్నాను. బహుశా మేమే ఆమెను పంపించామని తలచుకున్నప్పుడల్లా బాధ అవుతుంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు.

 

 నియోజకవర్గానికి మమ్మీ అయ్యింది

 నంద్యాల ఎంపీగా పీవీ నరసింహారావు మీద తాను పోటీ చేసినప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఆమెను మొదటిసారిగా పోటీలోకి దింపితే అందరూ డమ్మీ అభ్యర్థిని తెచ్చారని వ్యాఖ్యానించారని భూమా గుర్తుచేశారు. అయితే, ఆమె ఈ నియోజకవర్గానికి మమ్మీ అయిందన్నారు. ఆళ్లగడ్డ ఇంత ప్రశాంతంగా ఉందంటే గ్రూపులన్నీ ఏకం చేసిన ఘనత శోభమ్మదేనని వ్యాఖ్యానించారు.

 

 అమ్మ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా...!

 ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే  భూమా అఖిలప్రియ అన్నారు. తనకు ఎంతో ధైర్యం ఇచ్చిన మీకు రుణపడి ఉంటానని ప్రకటించారు. ‘తప్పకుండా అమ్మ కోరిక నెరవేరుతుందని, అమ్మ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. ఇంత మంది ఎంతో అభిమానంతో ఇక్కడకు వచ్చారని... ట్రాక్టర్ల మీద మహిళలు వచ్చారంటే అమ్మ మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. నంద్యాల సభ ముగిసిన తర్వాత చెల్లెలు ఆరోగ్యం బాగోలేదు చూసుకో.. నేను వస్తున్నా అని ఫోన్ చేసింది. అయితే, కొద్దిసేపట్లోనే మరణిస్తుందని ఊహించలేదని’ గద్గధ స్వరంతో వ్యాఖ్యానించారు.

 

  అమ్మ మరణించిన మూడు రోజులకే ప్రచారానికి వెళితే ఏమీ చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని.. ప్రజలే తనను ఓదార్చి, మేమున్నామని ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ‘చిన్నప్పుడు అమ్మ హాస్టల్ వద్దకు వస్తే గుర్తుపట్టలేదు. అప్పుడు అమ్మ ఎంతో బాధపడి ఇలాంటి పరిస్థితి రానివ్వనని మాట ఇచ్చింది. అయితే, ఎన్నికల సమయంలో అడిగితే ఒళ్లో తల పెట్టుకుని పడుకోబెట్టుకుని మాట్లాడింది. అయితే, ఈసారి తోడుగా ఉంటానని హామీ ఇవ్వలేదు. బహుశా అమ్మకు ముందే తెలిసీ హామీ ఇవ్వలేదోమో’ అని బాధాతప్త హృదయంతో అన్నారు.

 

 రాష్ట్ర ప్రజలందరికీ తోబుట్టువు

 పుట్టినప్పుడు తనకు మాత్రమే తోబుట్టువుని, ఇప్పుడు రా్రష్ట ప్రజలందరికీ తోబుట్టువుగా నిలిచిందని కర్నూలు ఎమ్మెల్యే, శోభానాగిరెడ్డి అన్న ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నాన్నకంటే గొప్పనేతగా ఎదిగిందన్నారు. ఇంత మంది మనస్సుల్లో అభిమానం సంపాదించిన ఆమె తనకు చెల్లెలు కావడం గర్విస్తున్నానని ప్రకటించారు. ‘ఇప్పటికీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కలిసిన ప్రతిసారి శోభక్క ప్రస్తావన వస్తుంది. అనేక మంది నన్ను కర్నూలు ఎమ్మెల్యేగా కంటే శోభమ్మ అన్న అని పరిచయం చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంటోంది.

 

  పార్టీ నాయకురాలిగా, తల్లిగా, ప్రజా ప్రతినిధిగా సమన్వయంతో చక్కటి బాధ్యతలు నిర్వర్తించారు’ అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విజయమ్మ తర్వాత పేరు తెచ్చుకున్న వ్యక్తి శోభక్క అని చెప్పడంలో అతిశయోక్తి కాదని ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయమ్మ వెంట ఉండి నడిపించిందని, విజయమ్మకు సలహాలు, సూచనలు ఇచ్చిందని గుర్తుచేశారు.

 

 కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర రెడ్డి, గౌరు చరిత, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, విశ్వేశ్వర రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, చాంద్ బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కుటుంబ సభ్యులు భూమా నారాయణ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, బుడ్డా శేషారెడ్డి, చెరకులపాడు నారాయణ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, తెర్నేకల్లు సు రేందర్ రెడ్డి, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, డీకే రాజశేఖర్, యాలూరు కాంతారెడ్డి, వంగాల ఈశ్వర్ రెడ్డి, ఎస్వీ ప్రసాద్ రెడ్డి, కర్రా హర్షవర్దన్ రెడ్డి, భూమా నర్శిరెడ్డి, పాల్గొన్నారు.

 

 భారీగా తరలివచ్చిన జనం

 శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు రా ష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మరోవైపు పేదల కోసం మె గా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్య లో ప్రజలు తరలివచ్చి... ఆమె చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలు శోభానాగిరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.

 

 

 అదేవిధంగా శోభానాగిరెడ్డి గురించి రచించిన పాటల సీడీని జగన్ ఆవిష్కరించారు. సభలో ఆమెలేని జీవితం నరకప్రాయమని... కేవలం పిల్లల కోసమే బతుకుతున్నానని మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అమ్మను తలచుకుని భూమా అఖిలప్రియ మాట్లాడినప్పుడు ఆమెతో పాటు సభలో పలువురు కంటతడి పెట్టుకుని జోహార్ శోభమ్మ అని నినాదాలు చేశారు. ఇక శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్వీ మోహన్‌రెడ్డి తర్వాత ఏడేళ్లకు జన్మించిన సంతానం కావడంతో పువ్వుల్లో పెట్టి చూసుకున్నామన్నారు. ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని.. మాటలు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

 

 పోటెత్తిన అభిమానులు

 ఆళ్లగడ్డ :శోభమ్మ సంస్మరణ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాల నుంచి ట్రాక్టర్‌లు, ఆటోలు, మినీ బస్సులు, మోటారు సైకిళ్లలో ఉదయం 9 గంటల నుంచే జనం శోభా ఘాట్ చేరుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభా ప్రాంగణం చేరుకునే సరికి 20వేల కుర్చీలు జనంతో నిండిపోయాయి. జగన్ రాకతో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుర్చీలు సరిపడక ప్రజలు నిలబడే అభిమాన నేత ప్రసంగం ఆలకించారు.

 

 శోభానాగిరెడ్డి చిత్రపటాల పంపిణీ

 శోభానాగిరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా నంద్యాల నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ముద్రించిన 40వేల శోభానాగిరెడ్డి చిత్రపటాలను సంస్మరణసభలో పంపిణీ చేశారు. నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో శోభా నాగిరెడ్డి పేరు చెప్పినప్పుడల్లా ప్రజలు ఆమె చిత్రపటాన్ని చూపుతూ శోభమ్మ ఇంకా తమ మదిలోనే ఉందంటూ నినదించారు. శోభానాగిరెడ్డి సంస్మరణసభకు వచ్చిన అందరూ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లో వచ్చి శోభమ్మకు నివాళులర్పించి సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు దారి కల్పించారు. అభిమానులందరికీ భోజన వసతి కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్ల సమన్వయంతో సంస్మరణ సభ ప్రశాంతంగా సాగింది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్‌ల ద్వారా శోభా నాగిరెడ్డి జ్ఞాపకాలతో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top