సీమ రాజకీయాల్లో ‘మహిళా శోభ’

సీమ రాజకీయాల్లో ‘మహిళా శోభ’ - Sakshi


నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా నేత  

బలమైన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్న శోభా నాగిరెడ్డి

 

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో భూమా శోభా నాగిరెడ్డి తిరుగులేని మహిళా నేత. 1997లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శోభ.. తనదైన ముద్రతో సీమ రాజకీయాలకు వన్నె తెచ్చారు. అత్యంత సమస్యాత్మకమైన ఆళ్లగడ్డలో రెండు బలమైన వర్గాలైన గంగుల, ఇరిగెలను ఎదుర్కొని నాలుగు పర్యాయాలు విజయం సాధించటమే కాదు.. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఆమె ఎనలేని కృషి చేశారు. తొలుత టీడీపీ, ఆ తర్వాత పీఆర్‌పీ.. తదనంతరం తుదివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఎక్కడ ఉన్నా కీలక నేతగానే ఉన్నారు. తను కొనసాగుతున్న పార్టీపై విమర్శలు వస్తే దీటుగా తిప్పికొట్టగలిగే నేర్పు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల ప్రజలతో శోభకు ప్రత్యేక అనుబంధం ఉంది. సీమలో తాగు, సాగునీటి కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

 

 రాజకీయ కుటుంబంలో జననం...

 

 మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి, దివంగత నారాయణమ్మ దంపతుల ఐదో సంతానం శోభా నాగిరెడ్డి. 1969 డిసెంబర్ 16న జన్మించారు. శోభకు నాగలక్ష్మమ్మ, నాగరత్నమ్మ అక్కలు కాగా.. ఎస్.వి.ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి అన్నలు. 1986లో భూమా నాగిరెడ్డితో వివాహమైంది. కూతుర్లు అఖిలప్రియ, నాగమౌనిక, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి. తండ్రి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సోదరి నాగరత్నమ్మ పత్తికొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ కాగా, సోదరుడు ఎస్.వి.మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. బావలు భూమా శేఖరరెడ్డి ఎమ్మెల్యే గాను, భూమా భాస్కర్‌రెడ్డి ఎంపీపీగా పదవుల్లో ఉంటూనే చనిపోయారు.

 

 నాలుగుసార్లు వరుస విజయాలు...

 

 తండ్రి మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, భర్త భూమా నాగిరెడ్డి సాహచర్యంలో 1997, 1999, 2009, 2012 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన మహిళా ప్రతినిధిగా శోభానాగిరెడ్డి రికార్డును సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999 లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 నవంబర్ 7న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో జనరల్ సెక్రటరీగా, పార్టీలో కీలక సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో భర్తతో పాటు శోభ ఆ పార్టీలో చేరారు. అక్కడ కూడా కీలకమైన అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కేవలం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందులో రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు.

 

 వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా...: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం.. వై.ఎస్. కుటుంబంతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో భూమా దంపతులు ఆ కుటుంబం వెంట నడిచారు. పీఆర్‌పీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున శోభానాగిరెడ్డి సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

 

 పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉండగా గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు శోభ తోడునీడగా నిలిచారు.

 

 ఆ ప్రాంతాల వారితో విడదీయరాని బంధం: జిల్లాలో కర్నూలు, నంద్యాల, పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల వారితో భూమా శోభా నాగిరెడ్డికి విడదీయరాని బంధం ఉంది. ఆళ్లగడ్డ జన్మస్థలం కావడంతో ఆ ప్రాంత వాసులు పార్టీలతో నిమిత్తం లేకండా భూమా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నంద్యాల ప్రజల్లో శోభా నాగిరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహించిన పత్తికొండ ప్రజలతోనూ ఆమెకు అనుబంధం ఉంది. సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ, ఎస్.వి.మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి కావడంతో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

 

 తాగు, సాగునీటి కోసం పోరాటం: కర్నూలు, వైఎస్సార్  జిల్లాల రైతులకు సాగు, తాగునీటి ప్రధాన కాలువ కేసీ కెనాల్ రైతుల కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీశారు. తాగు, సాగునీటి కోసం జరిగిన సాగునీటి సలహా మండలి, డీడీఆర్‌సీ సమావేశాలకు ఎవరు హాజరు కాకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో శోభా నాగిరెడ్డి హాజరయ్యే వారు. ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు, అధికారులు నీళ్లు నమిలేవారు. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రజల తరఫున ఆమె గళం వినిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.

 

 రాజకీయాలకు స్ఫూర్తి భూమానే

 శోభా నాగిరెడ్డి రాజకీయాలకు స్ఫూర్తి భర్త భూమా నాగిరెడ్డే. రాయలసీమ రాజకీయాల్లో మహిళలు నిలదొక్కుకోవడం ఎంతో కష్టం. అలాంటిది ఆళ్లగడ్డ లాంటి సమస్యాత్మక నియోజకవర్గంలో ఓ మహిళ 13 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా సేవలందించడం అబ్బురపరచే విషయం. ఇందుకు భర్త, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ప్రోత్సాహమే ప్రధాన కారణం. ‘మీ రాజకీయ గురువు ఎవర’ని ఎవరైనా అడిగితే తడుముకోకుండా భర్త భూమా నాగిరెడ్డి పేరు చెప్పేవారామె. 1997లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. శాసనసభకు వెళ్లేందుకు జంకుతుండగా భూమా స్వయంగా తీసుకెళ్లి అందరినీ పరిచయం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రశ్నలు వేయాలనే విషయంపైనా ఆమె భర్తతో చర్చలు జరిపేవారని సన్నిహితులు చెప్తారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top