జగన్ ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..!

జగన్ ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..! - Sakshi


జగన్‌దీక్షా శిబిరం వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేయని వైద్యాధికారులు

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న సంఘటన

టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాకు తప్పుడు వైద్య నివేదికలు

వాటి ఆధారంగా నోరుపారేసుకున్న మంత్రులు


 

గుంటూరు మెడికల్ ప్రతిపక్ష నేత ఆరోగ్యం సైతం వారికి పట్టదు.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినా వారిలో చలనం రాదు.. అధికారపార్టీ నేతలు చెప్పిన మాటలు విని వైద్య ధర్మాన్ని మరిచారు.. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడినే వైద్య పరీక్షలకు పంపుతారు.. తప్పుడు పరికరాలతో వైద్య పరీక్షలు చేస్తారు.. చివరకు రక్త నమూనాలను సైతం మార్చేస్తారు.. టీడీపీకి అనూకూలంగా ఉండే మీడియాకు తప్పుడు రిపోర్టులను అందించి లొల్లి చేస్తారు.. ఆ తప్పుడు నివేదికలను పట్టుకుని మంత్రులు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటారు.. ఇదీ ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ప్రభుత్వ వైఖరి.



శిబిరం వద్ద కనీసం అంబులెన్స్ లేదు

ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7వ తేదీ నుంచి గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా,  దీక్షా శిబిరం వద్ద జిల్లా వైద్యాధికారులు గాని, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి అధికారులు గాని కనీసం ఒక్క అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయక పోవటం పలు విమర్శలకు తావునిస్తోంది. ప్రత్యేకహోదాను కోరుతూ రాష్ట్రంలోని నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో దీక్షా వేదిక వద్దకు వచ్చారు. వీరిలో విద్యార్ధులు, మహిళలు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం  సాధారణంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడి పండుగలు చేసుకునే  ప్రదేశాల్లో,  తిరునాళ్ళ, ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా  అంబులెన్స్‌లు ఏర్పాటుచేయటం ఆనవాయితీ.



ప్రతిపక్ష నేత దీక్షా శిబిరం వద్ద ఒక్క అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకుండా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు మిన్నకుండి పోవటం వారి బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతుంది. ఐదు రోజుల దీక్ష అనంతరం వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళ న వ్యక్తం చేశారు.  కీటోన్ బాడీస్ శరీరంలో పెరిగిపోతూ ఉన్నాయని, శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని స్వయంగా జీజీహెచ్ వైద్యులే హెచ్చరించారు. కనీసం అలాంటి సమయాల్లోనైనా  అంబులెన్స్ ఏర్పాటుచేయకపోవటం చూస్తే ప్రతిపక్షనేతకు వైద్యాధికారులు ఇచ్చిన గౌరవం, ఆయన ఆరోగ్యం పట్ల వారికున్న శ్రద్ధ ఏపాటిదో అర్ధం అవుతోంది.

 

వైద్యపరీక్షల్లోనూ తప్పిదాలు ...

ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  నిరవధిక దీక్ష చేస్తున్న విషయం ఆస్పత్రి అధికారులు, జిల్లా వైద్యాధికారులకు తెలిసినా ఆయనకు చేయాల్సిన వ్యాధి నిర్ధారణ పరికరాలు అన్నీ అందుబాటులో పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహించారు. యూరిన్‌లో  కీటోన్‌బాడీస్ ఉన్నాయా లేవా అని పరీక్ష చేసేందుకు కేవలం 15 రూపాయల ఖరీదు చేసే  స్ట్రిప్ తమ వద్ద లేదని జీజీహెచ్ అధికారులు ప్రైవేటుల్యాబ్‌లో పరీక్షలు చేయించడం చూస్తే వీరి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమౌతుంది. ఆ నివేదికను ఆస్పత్రి అధికారులు అధికారికంగా మీడియాకు వెల్లడించకుండా ప్రభుత్వ మెప్పుకోసం టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాకు వెల్లడించారు. ఆ నివేదికను పట్టుకుని మంత్రులు జగన్ దీక్షపై నోరుపారేసుకున్నారు. అయితే రక్తనమూనాల సేకరణ, వైద్య పరికరాలు పనిచేయకపోవడం వల్లే తప్పు జరిగిందంటూ జీజీహెచ్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఆర్‌ఎంఓలు చెప్పడంతో మంత్రులు నాలుక్కరుచుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top