స్మార్ట్ హోదా డౌటే..

స్మార్ట్ హోదా డౌటే..


కమిషనర్  జి.వీరపాండియన్

విజయవాడ సెంట్రల్ :
స్మార్ట్‌సిటీ మిషన్ స్కోర్‌బోర్డులో వెనుకబడిన విజయవాడకు ఆ హోదా దక్కడం సందేహమేనని కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. మంగళవారం కౌన్సిల్ హాల్‌లో మేయర్, కార్పొరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. స్మార్ట్‌సిటీ, అమృత్ నగరాల విధివిధానాలను వివరించారు. మార్కుల ఆధారంగానే స్మార్ట్‌హోదా దక్కుతుందన్నారు. ఈ లెక్కన చూస్తే నగరం అన్ని విషయాల్లో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ, అమృత్ నగరాలకు సంబంధించి ప్రజల అవసరాలను గుర్తించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపాల్సి ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర వహించాలని కోరారు.



డివిజన్లవారీగా మౌలిక వసతులు ఏం కావాలనే దాన్ని గుర్తించమని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన సూచించారు. చేపట్టబోయే అభివృద్ధి పనుల్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బీఎన్ పుణ్యశీల మాట్లాడుతూ గతంలో కేంద్రం విడుదలచేసిన స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిధులు ఇంతవరకు నగరానికి ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ స్థలాల్లో గృహాలను తొలగించి అక్కడ కొత్తగా అపార్ట్‌మెంట్లు కట్టాలనుకునే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామన్నారు. అయితే, ఆ నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఆయా గృహాల వారికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. సీపీఎం కార్పొరేటర్ జి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ వన్‌టౌన్‌లో తాగునీటి పైపులైన్‌ను మార్చాలని, వైద్యసేవల్ని విస్తృతపర్చాలని, కార్పొరేషన్ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సిందిగా కోరారు. మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ జీవీ రమణారావు, టీడీపీ, బీజేపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, ఉత్తమ్‌చంద్ బండారీ తదితరులు పాల్గొన్నారు.

 

కలాం మృతి తీరని లోటు

అబ్దుల్ కలాం మృతి తీరని లోటని మేయర్  కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్‌లో మంగళవారం కలాం సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణరావు, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఎం ఫ్లోర్‌లీడర్లు జి.హరిబాబు, బీఎన్ పుణ్యశీల, జి.ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top