రావివలసలో స్వల్ప ఉద్రిక్తత

రావివలసలో స్వల్ప ఉద్రిక్తత


 పార్వతీపురం/గరుగుబిల్లి : గరుగుబిల్లి మండలంలోని రావివలస పీఏసీఎస్ బినామీ రుణాల విచారణ కేంద్రం వద్ద గురువారం స్వల్ప ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. విచారణలో మూడోరోజైన సీపీఎం జిల్లా నాయకులు మూడడ్ల కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, ద్వారపురెడ్డి సత్యనారాయణ, కోట సుమన్ తదితరుల ఆధ్వర్యంలో బాధితులు  ఆందోళన చేశారు. రుణగ్రహీతల జాబితాను వెల్లడించాలని కోరుతూ కార్యాలయం లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం సర్పంచ్ ప్రజలముందుకు రావాలి, డీసీసీబీ అధ్యక్షురాలు బాధితులకు సమాధానం చెప్పాలి, మాకొద్దు అవినీతి అధికారులంటూ ప్లకార్డులు పట్టుకుని బాధితులు  నినాదాలు చేశారు. సిబ్బంది, పాలకవర్గానికి చెందినవారి దిష్టిబొమ్మలను బాధితులు దహనం చేశారు.

 

 గేటు వద్ద బైఠాయింపు

    సీపీఎం ఆధ్వర్యంలో పీఏసీఎస్ కార్యాలయం ఎదుట బాధితులు  ధర్నా నిర్వహించారు. విచారణకు ఎవరూ హాజరుకాకుండా గేటువద్ద బైఠాయించారు. సిబ్బందిని తక్షణమే విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.  పీఏసీఎస్ అధికారులు, పాలకపక్షం బినామీల పేరుతో కోట్ల రూపాయలు రుణం వాడుకోవడంతో అసలు బ్యాంకుల్లో వాడుకున్న రైతులకు రుణమాఫీ  వర్తించని పరిస్థితి ఏర్పడిందన్నారు.  ఈ సందర్భంగా   గేట్లును తోసుకుని కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన  బాధితులకు, పోలీసులకు మధ్య  వాగ్వావాదం జరిగింది.  ఈ విషయమై ఉన్నతాధికారులు వచ్చి తమకు పూర్తి స్థాయిలో హామీలను ఇస్తేనే విచారణకు సహకరిస్తామని సీపీఎం  నేతలు అధికారులకు తెలియజేశారు.   కోట్లాది రూపాయలను కాజేసిన అధికారులను, డీసీసీబీ చైర్మన్, మెంబర్లను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.  విచారణ అధికారి పి. చిన్నయ్య పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతికి, ఏఎస్పీ రాహుల్ దేవ్‌శర్మకు రావివలస పీఏసీఎస్‌వద్ద జరిగిన సంఘటన గురించి వివరించారు.  

 

  ఏఎస్పీ హామీతో సద్దుమణిగిన ఆందోళన

  ఏఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ పీఏసీఎస్‌కు చేరుకొని బాధితుల సమస్యలపై సీపీఎం నాయకులతో చర్చించారు. బాధితులకు తగున్యాయం చేసేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ  ఇచ్చారు. అనంతరం విచారణ అధికారి పి. చిన్నయ్యతో విచారణలో జరుగుతున్న పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు. సొసైటీలో రుణాలు తీసుకున్నవారి వివరాలను బహిర్గతం చేయనున్నట్లు విచారణ అధికారి చిన్నయ్య తెలిపారు.

 

 నిందితులను అరెస్ట్ చేయకపోతే...22నుంచి ఆందోళన...

 ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హామీతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఈ నెల 21లోగా దోషులను విధులనుంచి తొలగించి అరెస్టు చేయకపోతే 22 నుంచి పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సీపీఎం  నాయకులు కృష్ణమూర్తి ఏఎస్పీకి తెలిపారు. విచారణకు సహకరిస్తే దోషులను శిక్షించేందుకు అవకాశం ఉంటుందని,   కలెక్టర్‌తో చర్చించి మరింత వేగవంతంగా చర్యలు చేపట్టేందుకు తనవంతు కృషిచేస్తానని ఏఎస్పీ హామీ ఇచ్చారు.  

 

 మూడో రోజు విచారణ కు 87 మంది హాజరు

  బినామీ రుణాల అవకతవకలపై మూడో రోజు గురువారం పార్వతీపురం డివిజన్ కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు పి.చిన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం నిర్వహించిన విచారణకు 87 మంది హాజరయ్యారు. ఇంతవరకు 209 మంది విచారణకు హాజరు కాగా,  వారు గతంలో పీఏసీఎస్‌లో ఎటువంటి రుణాలు తీసుకోలేదని తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం.  ఇదిలా ఉండగా ఈ పీఏసీఎస్ పరిధిలో 11వేలుకు పైగా రైతులుండగా, ఇందులో 4,485మంది రైతులు రుణం తీసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి.   

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top