శివయ్య సాక్షిగా బీసీల ఉద్యమం


శ్రీకాళహస్తి: బీసీలకు మంచి జరగాలని శ్రీకాళహస్తి శివయ్య చెంతతొలిసారిగా ఉద్యమం చేపట్టినట్లు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయకిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని స్కిట్ కళాశాల సమీపంలో బీసీ సంఘం నాయకులు హక్కుల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టారు. వారికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డే రంగుల ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ శివయ్య స్వామి చంద్రబాబు బుద్ధిని మార్పు చేసి బీసీల అభ్యున్నతికి దోహదపడేలా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. బీసీలు అన్ని పార్టీల్లో ఉ న్నారని, అయితే బాబు సర్కార్ తమకు ఓట్లు వేయలేదంటూ బీసీ వృద్ధులకు పెన్షన్లు తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.



అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిం చడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బీసీలకు ఎక్కడ అ న్యాయం జరిగితే అక్కడ పోరాటాలు చేయడానికి సంఘాన్ని పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ బీసీలకు బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు  రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 993 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ బీసీల పిల్లలు ఈ రోజు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తుచేశారు.



ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎందరో వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీలు, పేదలైన ఓసీలు కూడా ఉన్నత చదువులు చదువుకునే భాగ్యం లభిస్తోందన్నారు. రైతు రుణ మాఫీపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారంటూ వృద్ధులకు పెన్షన్లు తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం టీడీపీ అరాచకాలకు నిదర్శనమన్నారు. బీసీలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.



శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి బీసీల పక్షాన నిలుస్తారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ బీసీ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి మాట్లాడుతూ హక్కుల సాధనకోసం బీసీలు ఐక్యంగా పోరా టం చేయాలని పిలుపునిచ్చారు. వడ్డెర, రజక, వాల్మీకి, బెస్త కులాలను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుమ్మడి బాలకృష్ణయ్య మాట్లాడుతూ స్థానికంగా బీసీలకు తమ పార్టీ నుంచి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని...ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. వారితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, కొట్టెడి మధుశేఖర్, వయ్యాల కృష్ణారెడ్డి, సిరాజ్‌బాషా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చిలకా గోపి, పాపిరెడ్డి, శివ, శ్రీనివాసులు కూడా మద్దతు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top