అక్క కుమార్తెను వ్యభిచారం రొంపిలోకి దింపిన చిన్నమ్మ

అక్క కుమార్తెను వ్యభిచారం రొంపిలోకి దింపిన చిన్నమ్మ - Sakshi


 = ఆరోగ్యం బాగోలేదని వేటపాలెం నుంచి పిలిపించుకున్న వైనం

 = నెల్లూరు జిల్లా అల్లూరులో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదన

 = ఒంగోలులోని సీడబ్ల్యూసీని ఆశ్రయించిన యువతి నాయనమ్మ

 = చైల్డ్‌లైన్ సాయంతో బాధితురాలికి విముక్తి కల్పించిన పోలీసులు


 

 ఒంగోలు క్రైం : ఆశ మనుషులను ఎన్ని పనులైనా చేయిస్తోంది. సంపాదనే ధ్యేయంగా కొందరు ఎంతటి నీచానికైనా వడిగడుతారనడానికి ఇదో ఉదాహరణ. ఓ పినతల్లి సొంత అక్క కూతురినే వ్యభిచారం రొంపిలోకి దింపి చేతినిండా సంపాదించాలని పథక రచన చేసింది. పది రోజులపాటు 17 ఏళ్ల ఆ యువతి బతుకును బుగ్గి చేసింది. వివరాలు.. బాధిత యువతిది వేటపాలెం. ఆ వ ంచక పిన్నిది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు. యువతికి తల్లి లేదు. తండ్రి ఉంటే పట్టించుకోడు. నాయనమ్మే చేరదీసి సాకుతోంది.

 

  సదరు యువతి పినతల్లి జ్యోతి తనకు ఆరోగ్యం బాగోలేదని, ఒక సారి వచ్చి పొమ్మని ఈ నెల 5వ తేదీన ఫోన్ చేసింది. ఎంతైనా తల్లి తర్వాత తల్లి కదా..అని ఆ యువతి అల్లూరు వెళ్లింది. అదును కోసం ఎదురు చూస్తున్న పినతల్లి.. వెంటనే యువతిని బంధించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. యువతి నాయనమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మాయి ఏదో ఒక పనిలో ఉందని చెబుతోంది. పదే పదే ఫోన్ చేస్తుంటే తాను ఎప్పుడో వేటపాలెం పంపించి వేశానని చిరాకుగా చెప్పింది. ఇదిలా ఉండగా జ్యోతి మరో మహిళ నిర్మలాదేవితో కలిసి వ్యభిచారం రాకెట్ నడుపుతున్నట్లు బాధితురాలి నాయనమ్మకు తెలిసింది.

 

ఆమె నేరుగా ఒంగోలు చేరుకొని ఈ నెల 16న విషయాన్ని బాలల సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్ తన సహచరులతో కలిసి నెల్లూరు జిల్లా కోవూరు సీఐ అశోక్‌వర్ధన్‌ను కలిశారు. ఆయన వెంటనే కేసును అల్లూరు ఎస్సై చల్లా వాసుకు అప్పగించారు. రంగంలోకి దిగిన ఎస్సై వాసు.. యువతి పినతల్లి జ్యోతి గుట్టు రట్టు చేశారు. సదరు ఎస్సై స్వగ్రామం చినగంజాం కావడంతో ప్రాంతీయాభినం కూడా తోడై బాలికను వ్యభిచార కూపం నుంచి బయటకు తెచ్చే వరకూ కేసుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. బాధితురాలి పినతల్లి జ్యోతితో పాటు మరో మహిళ నిర్మలాదేవిపై అల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top