సారూ.. నీరేదీ?


సాక్షి ప్రతినిధి, కడప : ‘గాలి మోటార్లలో విస్తృత పర్యటన, గాలి కబుర్లతో కాలయాపన’ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు అంశాలను ప్రధానంగా పెట్టుకున్నారని జనం ఎద్దేవా చేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించడం, ప్రజలను మభ్యపెట్టడం, ఆశలు రేకెత్తించడమే ధ్యేయంగా ఆయన ముందుకు వెళుతున్నారు. గండికోట ప్రాజెక్టుకు జూలై నాటికి నీరు ఇస్తామని ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇప్పటి వరకు పెండింగ్ పనుల్లో అర ఇంచు పురోగతి లేదు.

 

 ఈ నేపథ్యంలో ఆయన మరోమారు గండికోట ప్రాజెక్టు సందర్శనకు శుక్రవారం రానున్నారు. అధికారులపై నిప్పులు చెరిగి పేకమేడ లాంటి హామీలు గుప్పించనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘జూలై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం. అవసరమైతే కాలువ గట్లపై నిద్రచేస్తా. సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. కుప్పం కంటే ముందే పులివెందులకు నీరు ఇస్తాం’ అని ఫిబ్రవరి 27న ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శనకు వచ్చినపుడు హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనలో రైతులు ఆనందంలో మునిగిపోయారు.

 

 కృష్ణా జలాల రాకతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయని భావించారు. టీడీపీ నేతలు సైతం సీఎం మాటలకు ఉబ్బిపోయి.. వైదికపై ఆయనకు పాదాభివందనం చేశారు. నాలుగు నెలలు గడి చిపోయినా బాధితులకు పునరావసం, పరిహారం చెల్లింపు, నిర్వాసితులను ఖాళీ చేయించడంలో ఏమాత్రం పురోగతి లేదు. నిధుల లేమి నెపంతో గంపెడు మట్టి తీయలేదని, ఒక మీటర్ స్ట్రక్చర్ చేపట్టలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీ నేతలు పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు పర్యటనలు మాత్రం చేపట్టారు. వారి పర్యటన కోసం ప్రజాధనం ఖర్చు అయిన మేరకు కూడ ప్రాజెక్టు పురోగతికి వెచ్చించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

 

 జూలై నాటికి జిల్లాలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని ప్రకటించడం మినహా, ఆ తర్వాత బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించలేదు. జీఎన్‌ఎస్‌ఎస్‌కు కేవలం రూ.169 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. వాస్తవ పరిస్థితి ఇలాగుంటే యుద్ధప్రాతిపదిక పెండింగ్ పనులు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలని టీడీపీ నేత ఒక్కరు కూడా సూచించిన పాపాన పోలేదని పలువురు విమర్శిస్త్తున్నారు. పెపైచ్చు.. పులివెందులకు నీరు ఇవ్వాలని పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ఎదురు దాడి చేస్తున్నారు. మెట్ట ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.4200 కోట్లు ఖర్చుతో పనులు వేగవంతంగా చేపట్టారు. మరో రూ.1900 కోట్లు ఖర్చు చేయగల్గితే జిల్లాకు సాగు, తాగునీటికి ఢోకా ఉండదని నిపుణులు భావిస్తున్నారు. పోతిరెడ్డిపాడు-బనకచర్ల, బనకచర్ల-గోరుకల్లు, గోరుకల్లు-అవుకు, ఆవుకు-గండికోట రిజర్వాయర్ల వరకు మధ్యలో ఉన్న స్ట్రక్చర్స్ పెండింగ్‌లో అలాగే ఉండిపోయాయి. వీటితో పాటు గండికోట ముంపు గ్రామాలు ఖాళీ చేయాలంటే వారికి రూ.18 కోట్లు నుంచి రూ.20 కోట్లు పరిహారం అందించాలి. ఆర్ అండ్ ఆర్ పునరావస కార్యక్రమం సైతం నిధులు లేక నీరశించింది. ఇలాంటి వాస్తవ పరిస్థితులను విస్మరించి సీఎం మరో మారు జనాన్ని వంచించేందుకు వస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 ఎమ్మెల్యే సవాల్ నిజమైంది..

 జూలై నాటికి గండికోట, మైలవరంలో 35 టీఎంసీల నీరు నిల్వచేస్తే పదవికి రాజీనామా చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆనాడే ప్రకటించారు. అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం. ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ముఖ్యమంత్రి మాటలు పనికొస్తాయని నాడు జిల్లా ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. అక్షరాల వారి మాటలే నిజమయ్యాయి. అధికారులతో సమీక్ష నిర్వహించి గట్టిగా నాలుగు మాటలు మాట్లాడటానికి వస్తున్నారు తప్పితే మరేమీ కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.  

 

 నేడు గండికోటకు సీఎం

 కడప సెవెన్‌రోడ్స్ :  గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట జలాశయాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించనున్నారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి సాయంత్రం 3.30 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.15 గంటలకు గండికోట రిజర్వాయర్‌కు చేరుకుంటారు. టన్నెల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ పనులను పరిశీలిస్తారు. గాలేరు-నగరి ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు గండికోట నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 5.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.    ప్రత్యేక విమానంలో 6 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top