సారూ.. సంపకండి!


 సాక్షి, కడప/లింగాల : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు.. అన్న సామెత అక్షరాల కలెక్టర్ తీరుకు దర్పణం పడుతోంది. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కారించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా, సొంతంగా బోర్లు వేసుకుంటామంటే అనుమతి ఇవ్వడం లేదు. దీంతో జిల్లాలో నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే పలు వ్యవహారాలలో వివాదాస్పదమవుతున్న కలెక్టర్.. తాగునీటి సమస్యతో గొంతెండుతున్న గ్రామాల్లో కూడా బోర్లకు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఎంపీ నిధులు, ఇతరత్రా నిధులతో బోరు వేసుకుని దప్పిక తీర్చుకుంటాం మహా ప్రభో అంటున్నా.. కలెక్టర్ కనుకరించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 ఇదే సమస్య గురించి ఇటీవల జిల్లా పరిషత్ సమావేశంలో పలువురు సభ్యులు లేవనెత్తారు. బోర్లు వేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని, దప్పిక తీరక ప్రజలు అల్లాడిపోతున్నారని.. ట్యాంకర్లతో ఎంత నీరు అందించినా పూర్తి స్థాయిలో అందని పరిస్థితులున్నాయని సభలో వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి సంగతి పక్కనపెడితే, కనీసం తాగునీటి అవసరాలకు బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. సొంతంగా బోరు వేసుకుంటామంటే అనుమతి ఇవ్వక, ప్రభుత్వం సరఫరా చేయక తాము తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని శుక్రవారం లింగాల మండలం ఇంటి ఓబాయపల్లె ప్రజలు పులివెందులలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వివరించారు.



తాగునీటి సమస్యతో జనం నెత్తి, నోరు కొట్టుకుంటున్నా మమ్ములను పట్టించుకొనేవారే లేరని..  తాగడానికి కూడా లేక అల్లాడుతున్నామని వైఎస్ జగన్‌కు విన్నవించారు. ఈ సమస్యపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో చర్చించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ నిధులు ఖర్చు చేసైనా బోర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నా కలెక్టర్ అనుమతి ఇవ్వడంలేదని గ్రామస్తులు వివరించారు.

 

 రెండు నెలలుగా అవస్థలు

 లింగాల మండలంలోని కామసముద్రం పంచాయతీ పరిధిలోని ఇంటి ఓబాయపల్లెలో సుమారు 500 పైచిలుకు జనాభా ఉంది. గ్రామంలో నాలుగు చేతి పంపులు, రెండు బోరు బావులు ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుఎస్‌కు సంబంధించిన పంచాయతీ బోరు ఉన్నా, నీరు అడుగంటిపోయింది. ట్యాంకర్‌తో సరఫరా చేస్తున్న మూడు ట్రిప్పుల నీరు ఎవరికీ సరిపోవడం లేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గంలోని 177 గ్రామాలకు తాగునీరు అందించాల్సిన పార్నపల్లె తాగునీటి పథకం రాను.. రానూ అధ్వాన్నంగా మారుతోంది.

 

 ప్రస్తుతం 50 గ్రామాలకు కూడా సక్రమంగా అందించలేని పరిస్థితికి చేరుకుంది. ‘ఇంటి ఓబాయపల్లెకు సంబంధించి పార్నపల్లె పథకం పైపులైన్ ఉన్నా.. ఏనాడూ సక్రమంగా నీరు రావడంలేదు. ఈ గ్రామానికి ప్రత్యేక సంప్, పైప్ లైను ఏర్పాటు చేసినా మూడు రోజులకోమారు అంతంత మాత్రంగా నీరు సరఫరా అవుతోంది. ఇలాగైతే ఎండా కాలంలో ఎలా.. విద్యుత్ ఉన్నప్పుడు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంద’ని గ్రామస్తులు వై.ప్రతాప్‌రెడ్డి, పి.రామచంద్రారెడ్డి వాపోయారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top