అన్ని పన్నులకూ ఒకే నోటీస్‌!

అన్ని పన్నులకూ ఒకే నోటీస్‌!


► మునిసిపాలిటీల్లో తగ్గనున్న పనిభారం

► ఈ ఏడాదే అమలు చేయనున్న డీఎంఏ

► ప్రజలకు సులువుగా సేవలు


ఆస్తి పన్నుకు ఓ నోటీసు.. నీటి పన్నుకు ఇంకొకటి.. ఖాళీ జాగాకు మరొకటి ఇలా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో రకరకాల పన్నులకు సంబంధించి వచ్చే నోటీసులు ఇక తగ్గనున్నాయి. ప్రజల ఆస్తిపన్ను నంబరు ఆధారంగా అన్ని పన్నులకు కలిపి ఒకటే డిమాండ్‌ నోటీసు ఇచ్చేలా రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ (డీఎంఏ) నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లాలోని మునిసిపల్, కార్పొరేషన్‌ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. ఫలితంగా ప్రజలు సులువుగా పన్నులు చెల్లించడంతో పాటు అధికారులకు పనిభారం కూడా తగ్గనుంది.   


చిత్తూరు (అర్బన్‌): కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పన్నుల చెల్లింపు విధానం సులభతరం కానుంది. జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో 1.86 లక్షల భవనాల నుంచి ఆస్తి పన్నులు, నీటి పన్నులు వసూలు చేయడానికి ఏటా రెండుసార్లు డిమాండు నోటీసులు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఖాళీ జాగా పన్ను, ప్రకటనల పన్ను, వినోదపు పన్ను, గ్రంథాలయాల పన్ను లాంటివి చెల్లించాలని మునిసిపల్‌ అధికారులు ప్రజలకు నోటీసులు ఇస్తుంటారు.


వీటితో పాటు సక్రమంగా ఆస్తిపన్ను చెల్లించని వాళ్లకు రెడ్‌ నోటీసులు పంపడం పరిపాటే. మునిసిపాలిటీల్లో ప్రతీ ఆర్నెళ్లకు ఓసారి ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటు ఉన్నా.. కార్పొరేషన్లలో ఏటా ఒకేసారి పన్నులు చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. పైగా సంవత్సరానికి సబంధించిన పన్ను అడ్వాన్సుగా చెల్లించే వారికి మొత్తం డిమాండులో 5 శాతం తగ్గించుకుంటున్నారు. అయితే సంవత్సరంలో  రకరకాల డిమాండు నోటీసులు వస్తుండడంతో జనం ఒకింత ఆందోళనతో పాటు  విసుక్కుంటున్నారు.


దీంతో అన్ని పన్నులకు కలిపి ఒకటే నోటీసు ఇచ్చి.. వాటి ద్వారా ఏయేదానికి ఎంతెంత పన్నులు వసూలు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఇంటిగ్రేటెడ్‌ నోటీసులను తయారు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేసేందుకు  రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ సిద్ధమవుతోంది. ఫలితంగా ప్రజలకు సేవలు సులువుగా అందడంతో పాటు ఇప్పటివరకు డిమాండు నోటీసులు అందిస్తున్న బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, కార్మికులకు ఈ పనిభారం తగ్గనుంది. త్వరలోనే బిల్‌ కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రజలకు ఒకటే నోటీసు అందించడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top