ఖరీఫ్‌కు గడ్డుకాలం

ఖరీఫ్‌కు గడ్డుకాలం - Sakshi


సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఈ ఖరీఫ్ ప్రారంభం నుంచి రైతుకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. పాలనాపరమైన అంశాల్లో జాప్యం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. గత ఏడాది ఇదే నెలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగాయి.

 

 రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ పనుల్లో  హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు పనులు ప్రారంభించే అవకాశాలు లేక రైతులు దిక్కులు చూస్తుంటే, వ్యవసాయ కార్మికులు పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. రెతులకు ఏలికలు ఇచ్చిన హామీలు, వాతావరణం అనుకూలించకపోవడం ఈ దుస్థితికి కారణం. ముఖ్యంగా బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం రుణాలను టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేస్తారని ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు.

 

 అందుకు విరుద్ధంగా సీఎం రుణమాఫీపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు బ్యాంకులకు అందకపోవడంతో పాత రుణాలు రద్దు కాక కొత్త రుణాలు మంజూరుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో రొక్కం లేక విత్తనమే కొనుగోలు చేయలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

 

  జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 2.39 లక్షల హెక్టార్లు. వరి, పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగవుతుంటాయి.

 

 వర్షాలు లేక రిజర్వాయర్లలోని నీటి మట్టం అడుగంటటంతో ప్రభుత్వం  కూడా కాలువలకు సాగునీటిని విడుదల చేయలేక పోయింది.

 

 ప్రతీ సంవత్సరం జూలై రెండో వారంలో నారుమడులు సిద్ధం చేసుకునేందుకు ప్రభుత్వం కాలువలకు నీటిని విడుదల చేసేది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే రెండుసార్లు విడుదల చేసింది.

 

 రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. పాత రుణాలు రద్దు కాక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

 

 గత ఏడాది జూన్ నెల 20 వ తేదీ నాటికి బ్యాంకర్లు రైతులకు సుమారు రూ.1000 కోట్ల రుణాలను ఇస్తే ఈఏడాది ఇప్పటి వరకు రూ.125 కోట్లు మాత్ర మే ఇచ్చారు. రూ.6,328 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా తీసుకున్నాయి. రుణమాఫీ కారణంగా కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకర్లు లేరు.

 

 రుణమాఫీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోల్చితే పూర్తిగా పడిపోయాయి. గత ఏడాది, ప్రస్తుతం పంటల సాగు ఇలా ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top