జూన్ నుంచి విజయవాడ నుంచే పాలన

జూన్ నుంచి విజయవాడ నుంచే పాలన - Sakshi

  • టీడీఎల్‌పీ భేటీలో చంద్రబాబు

  • సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్ నుంచి విజయవాడ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు చెప్పారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్ర  ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ఈ నగరాన్ని రాజకీయ కేంద్రంగా ఉపయోగించుకుందామని చెప్పారు. కొన్ని శాఖల కార్యాలయాలను విజయవాడ తరలించి అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు.



    గురువారం శాసనసభ ఆవరణలోని కమిటీ హాలులో టీడీపీ శాసనసభాపక్షం (టీడీఎల్‌పీ) సమావేశం జరిగింది. ఇందులో చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడలో తాను క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అనువైన భవనాలు లభించని పక్షంలో తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని అందులోకి తరలించి పాలన సాగిస్తామన్నారు.

     

    ప్రతీ శనివారం  సమావేశమవుతా...



    ఈ సమావేశంలో ఎక్కువ మంది తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ప్రస్తావించగా.. టీడీఎల్‌పీ సమావేశంలో నియోజకవర్గం లేదా వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించవద్దని బాబు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎమ్మెల్యేతో సమావేశం అవుతానని, కొత్త ఏడాది జనవరి మూడో తేదీ శనివారం నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తామని పేర్కొన్నారు.

     

    త్వరలో లే-అవుట్ల క్రమబద్ధీకరణ



    డీకేటీ పట్టాలు పొందిన వారి భూములను క్రమబద్ధీకరించాలని రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కోరగా కొంత సమయం పడుతుందని చంద్రబాబు చెప్పారు. ఈలోగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రుణ విముక్తికి అవసరమైన నిధులు విడుదల చేశామని, అయితే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.



    ఇదిలావుంటే.. రైతు రుణ విముక్తి పథకంపై గురువారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పలువురు మంత్రులతో పాటు ఆర్థిక రంగ నిపుణులు వారికి సూచనలు, సలహాలు అందచేశారు. రుణ విముక్తి అంశంపై ప్రతిపక్షం ఏ అంశాన్ని ప్రస్తావించినా ఎదురుదాడి చేయాలని సూచించారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి టీడీ ఎల్‌పీ సంతాపం ప్రకటించింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top