దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా..

దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా..


 ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరిక

 అప్రమత్తమైన దేవస్థానం, పోలీసు అధికారులు

 కొండపై నిఘా కట్టుదిట్టం

 ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక


 

విజయవాడ : నిత్యం భక్తులతో జనసమ్మర్థంగా ఉండే ఇంద్రకీలాద్రిపై సిమీ ఉగ్రవాదులు కన్నేశారా.. దుర్గమ్మ ఆలయాన్ని టార్గెట్ చేశారా.. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్) దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో సోమవారం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అబుఫైజల్ గ్యాంగ్‌కు చెందిన సిమీ ఉగ్రవాదులు అస్లాం, ఇజాజ్ అహ్మద్ హతమైన సంగతి తెలిసిందే.

 

 మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఫైజల్ సహా ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ఇద్దరూ గతంలో విజయవాడలో జనసమ్మర్థంగా ఉండే కొన్ని ముఖ్యమైన స్థలాలపై రెక్కీ నిర్వహించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. రెండోసారి విజయవాడకు వస్తూనే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని, మిగిలిన నలుగురు ఉగ్రవాదులు రాజధాని ప్రాంతంలోనే తలదాచుకున్నారనే అనుమానాలు ఇంటిలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.

 

 అధికారులు అప్రమత్తం...

 ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు వెంటనే దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవయ్యతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) కమాండెంట్ నాగమల్లేశ్వరరావు, సివిల్ పోలీసు, సెక్యూరిటీ సిబ్బందితో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల గురించి చర్చించారు. దేవస్థానంలో మూడు షిఫ్టుల్లోనూ కలిపి 113 మంది ఓపీడీఎస్ సిబ్బంది, 18 మంది ఎస్‌పీఎఫ్ సిబ్బంది, 20 మంది హోమ్‌గార్డులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి వీరు సరిపోతారని, అయితే వీరు నిరంతరం నిఘాను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

 

సెల్‌ఫోన్లపై నిషేధం!

ప్రస్తుతానికి దేవస్థానంలో సెల్‌ఫోన్‌లను అధికారులు అనుమతిస్తున్నారు. అయితే సెల్‌ఫోన్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి భక్తులు అక్కడ పెట్టుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పోలీసు, సెక్యురిటీ అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న డాగ్ చెకింగ్, భక్తుల బ్యాగుల చెకింగ్‌లను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి భక్తుల బ్యాగులను అనుమతించకూడదనే నిబంధన మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.

 

 దేవస్థానానికి వచ్చే దారులన్నింటిలోనూ రాత్రివేళల్లోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎస్‌పీఎఫ్ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దేవస్థానంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తామని, అవసరమైతే మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని దేవస్థానం అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

 ప్రభుత్వానికి నివేదిక...

 విజయవాడ నగరంలో సిమీ ఉగ్రవాదుల జాడలు కనపడుతున్న నేపథ్యంలో దేవస్థానంలో తీసుకునే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న రక్షణ చర్యలపై పోలీసు, దేవస్థానం అధికారులు ఒక ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోరిక మేరకే ఈ నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి సెక్యురిటీ పరంగా ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు వస్తే వాటిని కూడా తక్షణం అమలు చేసేందుకు దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top