ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు..


- సింహాచలం భూముల క్రమబద్దీకరణ

- కేబినెట్‌లో తాజాగా ఆమోదం

- 12,149 మందికి లబ్ది

- 60 గజాల్లోపు ఆక్రమించుకున్న 1665 మందికి ఉచితం

సాక్షి, విశాఖపట్నం:
దశాబ్దాల కల సాకారమవుతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సింహాచలం భూముల ఆక్రమిత బాధితులకు ఊరట లభించింది. ఏళ్లతరబడి ఆక్రమించుకున్నవారివే క్రమబద్ధీకరించాలని శనివారం విజయవాడలో కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2008లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుననుసరించి పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. సింహాచలం దేవస్థానికిచెందిన 419ఎకరాల భూమి రెండు దశాబ్దాల క్రితం ఆక్రమణకు గురైంది.



ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2232కోట్లకు పైగా ఉంది. 12,149 మంది ఆక్రమించు కుని పక్కాకట్టడాలు నిర్మించుకున్నారు. 2008వరకు ఆక్రమించుకుని నిర్మించుకున్న పక్కా భవనాలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆక్రమించుకున్న వారిని మూడు కేటగిరిలుగా విభజించింది. తొలికేటగిరిలో 60 చదరపు గజాలలోపు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 300 గజాల్లోపు ఆక్రమించుకున్న వారికి 1998 సంవత్సరం నాటి మార్కెట్ రేటులో 70 శాతంతో పాటు నాటి నుంచి నేటి వరకు ఏటా 9 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తే క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.



ఇక 300 గజాలకు పైబడి ఆక్రమించుకున్న వారికి మాత్రం ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా 60 చదరపు గజాల్లోపు ఆక్రమించుకున్న వారు 1665 మంది ఉండగా, 300 చదరపు గజాల్లోపు ఆక్రమించుకున్న వారు 9366 మంది ఉన్నారు. 300 చదరపు గజాలు పైబడి ఆక్రమించుకున్న వారు 1118 ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 547 ఎకరాలను సింహాచలం దేవస్థానానికి కేటాయించాలని కేబినెట్ నిర్ణయిం చింది. ఈభూముల కనీసవిలువ రూ.609కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దేవస్థానం నష్టపోతున్న 419 ఎకరాల భూమి విలువ రూ.2232 కోట్లుగా లెక్క తేల్చింది. ఈ మేరకు ప్రత్యామ్నాయ భూమితో పాటు రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చే రూ.989కోట్ల ఆదాయాన్ని కూడా దేవస్థానానికి చెందేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top