జల్లెడ పడుతున్న బలగాలు

జల్లెడ పడుతున్న బలగాలు - Sakshi


- ఏజెన్సీలో మావో అగ్రనేతలు చలపతి, రవి

- వరుసగా రెండు రోజులు ఎదురు కాల్పులు

- పక్కా సమాచారంతో కదులుతున్న పోలీసులు

సాక్షి,విశాఖపట్నం:
మావోయిస్టు అగ్రనేతలు లక్ష్యంగా మన్యంలో పోలీసు బలగాలు ఉధృతంగా కూంబింగ్ జరుపుతున్నాయి. వరుసగా రెండు రోజులు దళసభ్యులు, గ్రేహౌండ్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కేంద్రకమిటీ సభ్యుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ప్రత్యేక బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కమిటీల ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత మన్యం మరోసారి వేడెక్కింది. ఇటీవల మావోయిస్టుల ఉద్యమానికి ఎదురు దెబ్బలు, బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం యత్నాలతో మన్యంలోకి మావోయిస్టు అగ్రనేతలు అడుగుపెట్టారు.



గ్రామాల్లో సభల ద్వారా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పక్కాసమాచారంతో ప్రత్యేక బలగాలు మన్యాన్ని చుట్టుముట్టాయి. బ్యాంకుల వద్ద, సంతల్లో డేగ కళ్లతో పరిశీలిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారిచ్చే సమాచారంతో దళసభ్యులకు అతి సమీపంగా పోలీసు బలగాలు వెళుతున్నాయి. ఇందులో భాగంగానే ఇరువర్గాలకు మధ్య బుధ, గురు వారాల్లో ఎరుదు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు చెబుతున్నారు.



అగ్ర నేతలే లక్ష్యం?

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌చార్జ్ చలపతి, మావోయిస్టు మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్‌సీ) కమాండర్  కుడుముల వెంకట్రావు అలియాస్ రవి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబళ్లకేశవరావు అలియాస్ గంగన్నలతో పాటు దళం ముఖ్య సభ్యులు సరిత, ఆజాద్, ఆనంద్‌లు మన్యంలో సంచరిస్తున్నట్లు పోలీసులు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎలాగైనా అగ్ర నేతలను పట్టుకోవడమో లేక మట్టుబెట్టడమో చేయాలని వ్యూహాత్మకంగా కూంబింగ్ చేపడుతున్నారు. బుధవారం కొయ్యూరు మండలం కునుకూరులో కాల్పుల అనంతరం దళసభ్యులు వెళ్లి ఉంటారనే అంచనాతో గురువారం ఆ దిశగా బలగాలను కదిలించారు. వారి వ్యూహం ఫలించి దళం ఆచూకీ లభించింది. ఆపై చకచకా కాల్పులు జరిగిపోయాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top